వరుణదేవా.. కానరావా..!

వరుణుడి కరుణ కోసం ఊట్కూర్‌లో సప్తాహ భజనలు

ఊట్కూర్ (ఆంధ్రప్రభ): సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని కోరుతూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని దేవినగర్ కాళికామాత ఆలయంలో బుధవారం రైతులు, మహిళలు, చిన్నారులు భక్తిశ్రద్ధలతో సప్తాహ భజనలు ప్రారంభించారు. ఉపవాస దీక్షలు చేపట్టి “ఓం నమశివాయ” నామస్మరణతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వరుణ దేవుడిని ప్రార్థించారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, వానాకాలం ప్రారంభంలో ఆశాజనకంగా సాగు చేసిన పత్తి, కంది తదితర పంటలు తగినంత వర్షపాతం లేక ఎండుముఖం పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పలుచోట్ల పంటలు వాడిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. విస్తారంగా వర్షాలు కురిసి పంటలు కాపాడాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సప్తాహ భజనల్లో మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి గీతాలు ఆలపించగా, ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.