భారీ వృక్షం నేలకొరిగింది.. పెను ప్రమాదం తప్పింది!

వర్షం విరుచుకుపడింది.. జనజీవనం స్తంభించింది!

కోరుట్ల, జూలై 30 (ఆంధ్ర ప్రభ):::– కోరుట్ల మండలంతో పాటు పట్టణంలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ప్రజల జనజీవనం తీవ్రంగా దెబ్బతింది.
కోరుట్ల పట్టణంలోని ఆనంద్‌నగర్‌లో భారీ వృక్షం విద్యుత్ ప్రధాన వైర్లపై విరిగి పడింది. రహదారికి అడ్డంగా చెట్టు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చెట్టు కూలిన సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న అధికారులు వెంటనే స్పందించి, జేసీబీ సహాయంతో విద్యుత్ వైర్లపై పడిన చెట్టును తొలగించారు. అనంతరం రహదారిని శుభ్రపరిచి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
ఇదిలా ఉండగా గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కోరుట్ల పట్టణంలోని అర్ఫాత్‌పురలో ఒక ఇల్లు కూలిపోయింది. ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన ఇంటి యజమానులు అప్రమత్తమై బయటకు రావడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే ఇంటితో పాటు ఇతర ఆస్తులకు నష్టం వాటిల్లింది.
భారీ వర్షాల ప్రభావంతో ఆదర్శ్‌నగర్, నయీమ్‌నగర్, బెండపల్లి, సర్వర్‌నగర్, హైదర్‌గూడా, మొమిన్‌పురా, అంబేద్కర్‌నగర్, మహమ్మదియాపురా, హాజీపుర, సాయిరాం నగర్ తదితర ప్రాంతాల్లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక కాలనీల్లో రహదారులు జలమయం కావడంతో రాకపోకలు స్తంభించాయి.
అలాగే కుంటలు, చెరువులు, కాలువలు, పెద్దవాగులు వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షాల తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.