ఎడతెరిపి లేని వర్షాలకు కూలిన రెండు ఇళ్లు
ఇద్దరు బాధిత కుటుంబాలు నిరాశ్రయులు..
ప్రభుత్వ సాయానికి విజ్ఞప్తి
దండెపల్లి, ఆంధ్రప్రభ : గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దండెపల్లి మండలంలోని కాసిపేట గ్రామంలో రెండు ఇళ్లు కూలిపోయాయి.
గ్రామానికి చెందిన సంతపురి రవి, గణపతి నివాసాలు భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిని కూలిపోయాయి. ఈ ఘటనతో ఇద్దరు బాధిత కుటుంబాలు ఒక్కసారిగా నిరాశ్రయులయ్యాయి.
ఇళ్లలోని గృహోపకరణాలు, ధాన్యం, నిత్యావసర వస్తువులు వర్షపు నీటిలో తడిసి తీవ్ర ఆర్థిక నష్టం వాటిల్లింది. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలాన్ని పరిశీలించి ఆస్తి నష్టాన్ని అంచనా వేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు దెబ్బతిన్న ఇళ్లకు ప్రభుత్వం పరిహారం మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
