గిరిజన డిగ్రీ కళాశాలలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం

కళాశాల యాజమాన్యం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు

మహబూబాబాద్ టౌన్, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు బుధవారం ఉదయం అదృశ్యమైన ఘటన కలకలం రేపింది.

ఉదయం హాజరు నమోదు చేసే సమయంలో ఇద్దరు విద్యార్థినులు కనిపించకపోవడంతో కళాశాల యాజమాన్యం విషయాన్ని గుర్తించింది.

ఈ ఘటనపై కళాశాల ప్రిన్సిపల్ బిందుమాధవి స్పందిస్తూ, విద్యార్థినుల అదృశ్యంపై వెంటనే స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అనుమానితులను గుర్తించి పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.

ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థినుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.