సహకార సంఘాల నామినేటెడ్ నియామకాలపై కోర్టును ఆశ్రయిస్తాం..
- బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నర్సంపేట, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను నామినేటెడ్ ఇన్‌చార్జీలుగా నియమించడం రైతు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, దీనిపై రైతుల తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు. శనివారం నర్సంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ పాలనలో రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పనిచేసిందన్నారు. రైతులకు సకాలంలో యూరియా, ఎరువులు అందించడంతో పాటు నకిలీ విత్తనాల బెడద లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
పంటల కొనుగోలు కేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేసి, రైతులు ఇబ్బందులు పడకుండా కొనుగోళ్లు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుల సహకారంతో 90 ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ( యఫ్ పి ఓ) కేంద్రాలు ఏర్పాటు చేసి, రూ.60 కోట్లతో విత్తన తయారీ కేంద్రాలను మంజూరు చేశామని పేర్కొన్నారు. ఎఫ్‌పీఓలు, సహకార సంఘాలు, ఐకేపీ మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలు అప్పగించి వాటిని లాభాల బాటలో నడిపించామని గుర్తుచేశారు. నర్సంపేట నియోజకవర్గంలోని 13 సహకార సంఘాల్లో రైతులు బీఆర్ఎస్ మద్దతు అభ్యర్థులను ఏకగ్రీవంగా గెలిపించారని, రైతుల విశ్వాసాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ ఇన్‌చార్జీలను నియమించిందని ఆరోపించారు.
ఇది సహకార వ్యవస్థను బలహీనపరిచే చర్య అని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వానికి రైతుల సంక్షేమంపై చిత్తశుద్ధి లేదని ఆరోపించిన ఆయన, రైతు భరోసా, బోనస్, పంటల కొనుగోలు, రుణమాఫీ వంటి అంశాల్లో రైతులను మోసం చేసిందన్నారు. కొనుగోలు చేసిన పంటలకు ఇప్పటికీ చెల్లింపులు పూర్తిచేయలేదని, సహకార సంఘాల ద్వారా ఇచ్చిన రుణాల్లో కూడా పరిమిత స్థాయిలోనే రుణమాఫీ చేసి చేతులు దులుపుకుందని విమర్శించారు.
ఎల్‌నినో ప్రభావంపై ముందుగానే హెచ్చరికలు వచ్చినప్పటికీ పాకాల, రంగయ్య చెరువు వంటి నీటి వనరులను సమర్థంగా వినియోగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ హయాంలో మే నెలాఖరు వరకు మోటార్ల ద్వారా చెరువులు నింపి, ఎస్సార్ఎస్పీ పైప్‌లైన్ ద్వారా నీటి నిల్వలు కల్పించామని, ప్రస్తుతం చెరువులు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.
రైతుల ఓట్లతో ఎన్నికైన సహకార సంఘాల పాలకవర్గాలను పక్కనబెట్టి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టడం అప్రజాస్వామిక చర్య అని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించే ధైర్యం ప్రభుత్వానికి లేకపోవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు.
సహకార వ్యవస్థను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించే ప్రభుత్వ నిర్ణయాన్ని రైతాంగం తిప్పికొడుతుందని, నామినేటెడ్ ఇన్‌చార్జీల నియామకాలకు సంబంధించిన జీవోలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించి రైతుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని పెద్ది సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
