రౌడీషీటర్ల కదలికలపై నిరంతర నిఘా అవసరం

కుటుంబానికి సమయం కేటాయిస్తూ ప్రజాసేవకు అంకితభావంతో పనిచేయాలి: ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర

సదాశివనగర్, ఆంధ్రప్రభ: రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర పోలీసు అధికారులకు సూచించారు.

బుధవారం సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, రిసెప్షన్, రైటర్ రూమ్, వివిధ రికార్డులు, సీసీటీఎన్‌ఎస్ నిర్వహణతో పాటు ఇతర విభాగాలను పరిశీలించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమై పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. స్టేషన్ పరిసరాలను సందర్శించి పరిశుభ్రత, నిర్వహణపై సూచనలు చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పరిశుభ్రమైన పోలీస్ స్టేషన్ సిబ్బందిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందించి విధుల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేస్తుందని అన్నారు. ప్రతి పోలీసు ఉద్యోగి తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు కుటుంబ సభ్యులతో సమయం గడపాలని సూచించారు. పిల్లల్లో మంచి విలువలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన ఆలోచనా విధానాన్ని పెంపొందించేలా తల్లిదండ్రులు ఆదర్శంగా ఉండాలని తెలిపారు.

జూదం, ఆన్‌లైన్ గేమింగ్ వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, వ్యక్తిగత క్రమశిక్షణే వృత్తిపరమైన నిబద్ధతకు పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యే ప్రతి కేసు, ప్రతి ఫిర్యాదును తప్పనిసరిగా సీసీటీఎన్‌ఎస్‌లో నమోదు చేసి ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు ఉండకూడదని ఆదేశించారు. జిల్లా కార్యాలయం నుంచి జారీ అయ్యే సూచనలను రోల్‌కాల్‌లో సిబ్బందికి సక్రమంగా తెలియజేస్తున్నారా అనే అంశంపై కూడా పోలీసు సిబ్బందిని ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

పోలీసు ఉద్యోగం కేవలం విధి మాత్రమే కాకుండా ప్రజాసేవ అనే భావనతో ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా వి.పి.ఓలు తమ గ్రామాలను తరచూ సందర్శించి స్థానిక పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలని, కీలక సమాచారం లభించిన వెంటనే సంబంధిత అధికారులకు చేరవేయాలని ఆదేశించారు.

పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును నమోదు చేసి నిష్పాక్షికంగా విచారణ నిర్వహించి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లు, అనుమానితుల కదలికలు, జీవన విధానం, కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచి నేర నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

సదాశివనగర్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసే ప్రతి పోలీసు ఉద్యోగి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించి ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు.

ఈ కార్యక్రమంలో సదాశివనగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, ఎస్‌ఐ ఎం. పుష్పరాజ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.