ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోతలు ప్రారంభం
నాలుగు బాహుబలి మోటార్లతో నీటి తరలింపు.. వరద కాలువలో మళ్లీ జలప్రవాహం
పెద్దపల్లి, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా చేరుతుండటంతో బుధవారం నుంచి ఎత్తిపోతలు ప్రారంభమయ్యాయి. నంది పంప్ హౌస్‌లోని బాహుబలి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి లభ్యత పెరగడంతో నంది పంప్ హౌస్‌లో ఉన్న ఏడు మోటార్లలో ప్రస్తుతం నాలుగు మోటార్లను వినియోగించి నీటిని మేడారం రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి అదే పరిమాణంలో రామడుగు మండలం లక్ష్మీపూర్ రిజర్వాయర్‌కు నీటిని పంపిస్తున్నారు.
గాయత్రి పంప్ హౌస్‌లో కూడా బాహుబలి మోటార్లను ప్రారంభించి వరద కాలువలోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. మేడారం పంప్ హౌస్‌లో ఒక్కో మోటారు ద్వారా 3,150 క్యూసెక్కుల చొప్పున మొత్తం 12,600 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. అలాగే మిడ్ మానేరు ప్రాజెక్టుకు కూడా నీటిని పంపిస్తున్నారు.
హైదరాబాద్ నగర తాగునీటి అవసరాల కోసం 275 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చాలా రోజుల తర్వాత వరద కాలువలో నీటి ప్రవాహం కనిపించడంతో పరిసర ప్రాంతాల రైతులు హర్షం వ్యక్తం చేశారు.
