విద్యాసంస్థల బస్సుల్లో వీఎల్టీడీ, డ్యాష్‌బోర్డ్ కెమెరాలు తప్పనిసరి

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని యాజమాన్యాలకు డీటీసీ షేక్ కరీమ్ సూచన

ఏలూరు, ఆంధ్రప్రభ: జిల్లాలోని అన్ని ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల్లో వాహన లొకేషన్ ట్రాకింగ్ డివైస్ (వీఎల్టీడీ), డ్యాష్‌బోర్డ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఉప రవాణా కమిషనర్ (డీటీసీ) షేక్ కరీమ్ విద్యాసంస్థల యాజమాన్యాలను కోరారు.

చొదిమెళ్లలోని ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా రహదారి భద్రతా కమిటీ నిర్ణయం మేరకు విద్యాసంస్థల బస్సుల్లో వీఎల్టీడీతో పాటు డ్యాష్‌బోర్డ్ కెమెరాలను ఏర్పాటు చేయడం ప్రయోజనకరమని తెలిపారు.

డ్యాష్‌బోర్డ్ కెమెరాల ఏర్పాటు వల్ల అత్యవసర సంఘటనలు, రోడ్డు ప్రమాదాల సమయంలో వీడియోలు కీలక సాక్ష్యాలుగా ఉపయోగపడతాయని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారనే నమ్మకం తల్లిదండ్రుల్లో పెరుగుతుందని చెప్పారు. అలాగే పారదర్శకత పెరగడంతో పాటు బస్సుల నిర్వహణ యాజమాన్యాలకు మరింత సులభతరం అవుతుందని వివరించారు.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని ప్రైవేటు విద్యాసంస్థల బస్సుల్లో వీఎల్టీడీ ఏర్పాటు తప్పనిసరి అని, యాజమాన్యాల వెసులుబాటును బట్టి డ్యాష్‌బోర్డ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

అదేవిధంగా పాఠశాల బస్సులు ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్ తదితర అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. డ్రైవర్లు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండటంతో పాటు యూనిఫాం ధరించాలని, కనీసం ఐదేళ్ల అనుభవం ఉండి 60 ఏళ్లలోపు వయస్సు కలిగిన డ్రైవర్లే విద్యాసంస్థల బస్సులు నడపాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వొద్దని హెచ్చరించారు.

ఈ సమావేశంలో ఆర్టీవో బాలేందు శేఖర్, వాహన తనిఖీ అధికారులు జి. స్వామి, ఎస్. జగదీశ్‌బాబు, విద్యాసంస్థల ప్రతినిధులు, పాఠశాల బస్సుల నిర్వాహకులు పాల్గొన్నారు.