‘రాజ్యాంగం మాట్లాడితే నాలుక కోస్తామంటారా?’..

కాళ్ల, ఆంధ్రప్రభ: రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిపై “నాలుక కోస్తా… సమాధి కడతా…” వంటి బెదిరింపు వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగతంగా తనపై మాత్రమే కాకుండా, రాజ్యాంగంపైనే దాడిగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

కాళ్ల మండలం పెదఅమిరంలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏలూరులో జైభీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, దీనిపై కాళ్ల మండలంలోని తన అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందని తెలిపారు. అదే విధంగా ఏలూరులో మరో అభిమాని కూడా ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు.

ఇక ప్రభుత్వం, డిప్యూటీ స్పీకర్ పదవిని, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో దుర్భాషలాడిన “ప్రశ్న” అనే వ్యక్తిపై కూడా పలువురు అభిమానులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న తనను బెదిరించినప్పటికీ చర్యలు తీసుకోకపోతే, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో అనుమానాలు తలెత్తుతాయని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రిజర్వేషన్ల అంశంపైనా ఆయన స్పందించారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం హిందూ మతం నుంచి క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారిన వారికి షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు వర్తించవని రాజ్యాంగంలో స్పష్టంగా ఉందని, అదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా పలుమార్లు స్పష్టం చేసిందని తెలిపారు.

“నేను రాజ్యాంగంలో ఉన్న అంశాన్నే ప్రస్తావించాను. రాజ్యాంగం చెప్పిన విషయాన్ని చెప్పినందుకు ‘నాలుక కోస్తా… సమాధి కడతా…’ అని బెదిరిస్తే, ప్రభుత్వం మౌనంగా ఉండటం దురదృష్టకరం” అని రఘురామకృష్ణరాజు అన్నారు.

“ఇది రాజ్యాంగంపై దాడి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని బెదిరించినా చర్యలు తీసుకోకపోతే, లా అండ్ ఆర్డర్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఎలా ఉంటుంది?” అని ఆయన ప్రశ్నించారు.

చివరగా, “మతం మారిన వారికి షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లు వర్తించవని రాజ్యాంగం చెబుతోంది. నేను అదే విషయాన్ని మళ్లీ మళ్లీ చెబుతూనే ఉంటాను” అంటూ తన నాలుకను చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags: Raghurama Krishnam Raju, Andhra Pradesh Politics