ఉగ్రరూపం దాల్చిన బోగత జలపాతం

వరద ఉద్ధృతితో సందర్శన నిలిపివేత.. పరిస్థితిని పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

వాజేడు, ఆంధ్రప్రభ: తెలంగాణ మినీ నయాగరాగా పేరుగాంచిన ములుగు జిల్లా వాజేడు మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బోగత జలపాతం గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉగ్రరూపం దాల్చింది. భారీగా వరద నీరు చేరడంతో జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

పరిస్థితిని గమనించిన అటవీశాఖ అధికారులు పర్యాటకుల భద్రత దృష్ట్యా బోగత జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి, సందర్శకులను జలపాతం వద్దకు అనుమతించడం లేదు.

సమాచారం అందుకున్న ములుగు జిల్లా కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటిడీఏ పీవో లెనిన్ వత్సల్ టోప్పో, ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్ బోగత జలపాతాన్ని సందర్శించి వరద ఉద్ధృతిని పరిశీలించారు.

అధికారులకు పలు సూచనలు చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఎవరినీ జలపాతం సందర్శనకు అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు.