వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన మూడు తాత్కాలిక రహదారులు
రాకపోకలు స్తంభనం.. 100 కిలోమీటర్ల అదనపు ప్రయాణం తప్పని పరిస్థితి
టేకుమట్ల, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు మానేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద ప్రవాహానికి కాల్వపల్లి–ఓడేడు గ్రామాల మధ్య నిర్మించిన తాత్కాలిక మట్టిరహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. అలాగే బోర్నపల్లి–ఎంపేడు, బోర్నపల్లి–కిష్టంపేట గ్రామాలను కలిపే తాత్కాలిక రహదారులు కూడా వరద ఉద్ధృతికి దెబ్బతిన్నాయి. దీంతో టేకుమట్ల మండల ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి.
పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మీదుగా ప్రవహించే హుస్సేన్మియా వాగు పొంగిపొర్లడంతో భారీగా వరదనీరు మానేరు వాగులోకి చేరింది. దీంతో గోదావరిఖని, మంథని, మంచిర్యాల, బెల్లంపల్లి, వేములవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గం తెగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రహదారులు దెబ్బతినడంతో టేకుమట్ల మండల ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి దాదాపు 100 కిలోమీటర్లు అదనంగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓడేడు గ్రామానికి చెందిన గీత కార్మికులు తాటి చెట్లెక్కేందుకు, రైతులు వ్యవసాయ పనుల కోసం ఇదే మార్గాన్ని వినియోగిస్తుండగా, రోడ్లు దెబ్బతినడంతో వారి జీవనోపాధిపైనా తీవ్ర ప్రభావం పడింది.
మానేరు వాగుపై గతంలో ప్రారంభించిన వంతెన నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇదే సమస్య పునరావృతమవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణ భద్రత, రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని వంతెన నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి శాశ్వత పరిష్కారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
