పరిశ్రమల్లో స్థానికులకు 70 శాతం ఉద్యోగాలు కల్పించాలి
హామీలు అమలు చేయాలని బీసీవై పార్టీ నేత డా. చిలకల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మండల పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు 70 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని బీసీవై పార్టీ తెలంగాణ పీఏసీ సభ్యుడు డా. చిలకల శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ, పరిశ్రమల స్థాపన సమయంలో స్థానికులకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో చదువుకున్న యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పరిశ్రమల్లో కార్మిక భద్రత, అగ్నిమాపక భద్రత, పర్యావరణ ప్రమాణాల అమలుపై సంబంధిత అధికారులు క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని కోరారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) నిధులను స్థానిక గ్రామాల అభివృద్ధి, పాఠశాలలు, ఆసుపత్రుల మెరుగుదలకు వినియోగించాలని సూచించారు.
స్థానిక యువతకు న్యాయమైన ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ధర్నాలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు ఎండీ జావేద్, కార్యదర్శులు పి. శ్రీనివాస్, అడేపు బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
