బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గకుండా చర్యలు తీసుకోవాలి

బెల్లంపల్లి ఏరియాలో పనుల పురోగతిని సమీక్షించిన సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు

రెబ్బెన, ఆంధ్రప్రభ: బెల్లంపల్లి ఏరియాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత తగ్గకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె. వెంకటేశ్వర్లు అధికారులను ఆదేశించారు.

బుధవారం బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శ్రీరమేష్‌తో కలిసి ఆయన బెల్లంపల్లి ఏరియాలో పర్యటించారు. ఖైరిగూడ ఓసీ వ్యూ పాయింట్ నుంచి పని ప్రదేశాలను పరిశీలించి, వర్షాల కారణంగా ఉత్పత్తిపై ప్రభావం పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కార్యాచరణపై అధికారులకు సూచనలు చేశారు. బొగ్గు నిల్వలను సమర్థంగా నిర్వహించాలని ఆదేశించారు.

అనంతరం గోలేటిలోని విజయ్ పత్ సమీపంలో మొక్కలు నాటారు. తర్వాత జీఎం కార్యాలయంలో అన్ని విభాగాల అధికారులతో సమావేశమై గోలేటి, ఎంవీకే ఉపరితల గనుల పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ఈ సందర్భంగా ఈ నెలలో పదవీ విరమణ పొందనున్న ఏరియా ఇంజినీర్ జి. కృష్ణమూర్తిని సింగరేణి డైరెక్టర్ కె. వెంకటేశ్వర్లు సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ జీఎం (క్వాలిటీ) పి. వీరభద్రరావు, ఖైరిగూడ పీఓ మచ్చగిరి నరేందర్, ఏరియా ఇంజినీర్ జి. కృష్ణమూర్తి, ఎస్‌ఓ టు జీఎం కె. రాజమల్లు, గోలేటి ఓసీ పీఓ ఎన్. ఉమాకాంత్, ఏరియా సేఫ్టీ అధికారి స్వామిరాజు, మేనేజర్ శంకర్, ఫారెస్ట్ అధికారిణి సుష్మ లక్ష్మి, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.