వైభవంగా గురుపూర్ణిమ వేడుకలు
పలు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
భవానిపురం, ఆంధ్రప్రభ: గురుపూర్ణిమ మహోత్సవాల సందర్భంగా విజయవాడ నగరంలోని పలు శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయాల్లో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ వైసీపీ ఇన్చార్జి వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం పాల్గొన్నారు. బాబావారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గురుపూర్ణిమ పవిత్ర దినాన శ్రీ షిర్డీ సాయిబాబా దర్శనం చేసుకుని భక్తులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మానవాళికి సాయిబాబా అందించిన ప్రేమ, శాంతి, సహనం, సర్వధర్మ సమభావం వంటి విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరించాలని కోరారు. సాయిబాబా దివ్య ఆశీస్సులతో విజయవాడ నగర ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. భక్తుల మధ్య ఆధ్యాత్మిక వాతావరణంలో గురుపూర్ణిమ మహోత్సవాలను జరుపుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు తెలిపారు.
గొల్లపాలెం గట్టులోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం, పూర్ణానందపేటలోని శ్రీ షిర్డీ సాయిబాబా ధ్యాన మందిరం, విద్యాధరపురంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం (చిన్న సాయిబాబా గుడి), గొల్లపూడిలోని మహాత్మా గాంధీ కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం, బీసెంట్ రోడ్డులోని శ్రీ సాయిబాబా ఆలయం, ముత్యాలంపాడులోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో నిర్వహించిన గురుపూర్ణిమ ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు.
అలాగే శ్రీ గురుదత్త సాయి సేవా సమితి, పేర్ల రామస్వామి–పట్నాల అప్పన్న ఆధ్వర్యంలో చిట్టినగర్ నగరాల కళ్యాణ మండపం సమీపంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా స్వామివారి ప్రసాదాన్ని వడ్డించారు.
