.విజయవాడ (ఆంధ్రప్రభ): ఉమ్మడి ఏపీలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో అత్యంత ప్రధానమైన వైదిక కమిటీలో పునర్వ్యవస్థీకరణ జరిగింది. రెండేళ్ల తర్వాత వైదిక కమిటీలో మార్పులు చేర్పులు చేస్తూ దేవాదిశాఖ కమిషనర్, ఆలయ కార్య నిర్వహణ అధికారి కే రామచంద్ర మోహన్ ఆదేశాలు తాజాగా జారీ చేశారు. ప్రధానంగా వైదిక కమిటీలో ఇద్దరు ప్రధాన అర్చకులను నియమించడంతోపాటు, ఒక్కరే ఉప ప్రధాన అర్చకులను నియమిస్తూ ఆదేశాలు వచ్చాయి.
ముఖ్యంగా సీనియారిటీనే ప్రాతిపదికగా మార్పులు చేర్పులో జరిగిన వైదిక కమిటీలో అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే మరింత మేలు జరుగుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కొత్తగా నియమించిన వైదిక కమిటీలో స్థానాచార్యులు వి శివప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్ దుర్గాప్రసాద్, వేద పండిట్ సిహెచ్ ఆంజనేయ ఘనాపాటి, మరో వేద పండితుగా వి సావస్య మహర్షి, మరో ప్రధాన అర్చకులు వై మల్లేశ్వర శాస్త్రి, ఉప ప్రధాన అర్చకులు కేఎన్ వి డి ఎం డిఎం ప్రసాద్ లను వైదిక కమిటీ లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయా సిబ్బంది సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుంటూ వైదిక కమిటీని నియమిస్తున్నట్లు ఈ ఒ రామచంద్ర మోహన్ పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్తగా నియమించిన వైదిక కమిటీ దేవస్థానానికి సంబంధించి అన్ని ముఖ్య వైదిక విషయాలలో ముహూర్తం నిర్ణయాలలో కార్యనిర్వహణ అధికారి కోరే విషయాలలో వారికి సూచనలు సలహాలు అందజేయాల్సి ఉంటుంది…..
అనుభవం కూడా తోడైతే..
.గతంలో 10 సభ్యులు ఉన్న వైదిక కమిటీలో ప్రస్తుతం ఆరుగురుకు మాత్రమే అవకాశం కల్పిస్తూ ఈవో ఉత్తరవులను జారీ చేశారు. ప్రస్తుతం ఆలయంలో విధులు నిర్వహిస్తున్న కొందరిని సీనియారిటీ ప్రాతిపదికగానే వైదిక కమిటీలో చోటు కల్పించారు. అయితే సీనియారిటీతో పాటు అనుభవం, ప్రతిభ ఉన్నవారికి కూడా అవకాశం కల్పిస్తే బాగుండేది అన్న వ్యాఖ్యలు ఇంద్రకీలాద్రిపై వినిపిస్తున్నాయి.
నిత్యం అమ్మవారికి జరిగే పూజలు పలు కార్యక్రమాలను పర్యవేక్షించాల్సిన వైదిక కమిటీ సభ్యులు ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమంలో వారు భాగస్వాములు కావలసి ఉంటుంది. అయితే ప్రస్తుతం కొత్తగా నియమించిన వైదిక కమిటీలో కొంతమంది అసలు అందుబాటులోనే ఉండరన్న విమర్శలు కూడా లేకపోలేదు.
ఎప్పుడు వస్తారో ఎప్పుడు వెళ్తారో కనీస సమాచారం కూడా ఉండదని చెబుతున్నారు. దీనికి తోడు వయస్సు పైబడి రిటైర్మెంట్ కి కాస్త అటు ఇటుగా ఉన్నవారు నేటి పరిస్థితులకు అనుగుణంగా పరుగట్టలేరని చెబుతున్నారు. తెల్లవారుజాము నుండి రాత్రి వరకు గుడిని అంటిపెట్టుకొని ఉంటూ నిత్యం జరిగే కార్యక్రమాలపై అనుభవం ప్రతిభ ఉన్నవారికి కూడా అవకాశం కల్పిస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో ఇద్దరు ప్రధానార్చకులు ఉండగా మరో ఇద్దరూ ఉప ప్రధానార్చకులు కూడా ఉంటే సమతుల్యంగా ఉంటుందంటున్నరు. ప్రస్తుతం కొత్తగా ఏర్పాటు చేసిన వైదిక కమిటీపై ఇంద్రకీలాద్రిపై భిన్న వ్యాఖ్యలు పెదవి విరుపులు వినిపిస్తున్నాయి.