డొంక రహదారుల నిర్మాణానికి చర్యలు..

ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు


గంపలగూడెం, జులై 29(ఆంధ్రప్రభ): మండలంలోని 24 గ్రామపంచాయతీల పరిధిలో రైతులు పొలాలకు వెళ్లేందుకు అవసరమైన సుమారు 70 కిలోమీటర్ల డొంక రహదారులు అభివృద్ధి చేయాల్సి ఉందని నియోజకవర్గ శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు.ఆయన బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో అధ్యక్షురాలు గోగులముడి శ్రీలక్ష్మీ అధ్యక్షతన జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ డొంక రహదారులను అభివృద్ధి చేస్తే రైతులకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని అన్నారు.ఇందుకోసం సంబంధిత గ్రామాల ప్రజాప్రతినిధులు,నాయకులు అవసరమైన డొంక రహదారుల వివరాలను ఆయా గ్రామ సచివాలయాల్లో అందజేయాలని ఆ ప్రతిపాదనల ఆధారంగా నిధుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పాలకవర్గానికి ఇదే చివర సర్వసభ్య సమావేశం కావడంతో గత ఐదు సంవత్సరాలుగా మండలాభివృద్ధికి చేసిన సేవలను గుర్తిస్తూ అభినందించారు.

పార్టీలు కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని,ఎన్నికలు పూర్తయ్యాక అందరం కలిసి గ్రామాలు,మండలం,నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.ఎంపిపి శ్రీలక్ష్మి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం జరిగిందని అన్నారు. రానున్న వర్షాకాలం దృష్ట్యా గ్రామపంచాయతీలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.అనంతరం వివిధ శాఖల అధికారులు వారి శాఖల పురోగతిని సమావేశంలో ప్రస్తావించారు. విద్యాశాఖ అధికారి పివిడిఎల్ నరసింహారావు మాట్లాడుతూ… ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 230 మంది విద్యార్థుల సంఖ్య పెరిగిందని జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు.ఐఐఐటి సీట్లు ముగ్గురు విద్యార్థులు పొందారని గుర్తు చేశారు.పశు వైద్యాధికారి సాయికృష్ణ మాట్లాడుతూ గంపలగూడెం పశువైద్యశాల శిథిలావస్థలో ఉందని ప్రస్తావించారు.విద్యుత్ శాఖ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ నెమలిలో చేపడుతున్న సబ్‌స్టేషన్ నిర్మాణం,కొత్త విద్యుత్ లైన్ల ఏర్పాటు,విద్యుత్ సరఫరా మెరుగుదల కోసం చేపట్టిన చర్యలను వివరించారు.

గృహ నిర్మాణ శాఖ ఏఈ మాట్లాడుతూ జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా మొత్తం 295 గృహాలు నిర్మాణానికై అర్హుల పేర్లు ఆమోదం పొందాయని నిధుల విడుదలపై ఇంకా స్పష్టత లేదని తెలిపారు. త్రాగునీటి శాఖ ఏఈ మాట్లాడుతూ… జలజీవన్ మిషన్ లో భాగంగా 10 కోట్ల రూపాయలు మంజూరు కొరకు సిఫారసు చేయడం జరిగిందని,పెద్ద కొమిర,వినగడప బిసి కాలనీ,జింకలపాలెంలో ఓవర్ హెడ్ ట్యాంకులు మంజూరు అయ్యాయని తెలిపారు. ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి వి.విజయకృష్ణ మాట్లాడుతూ వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని దోమలపై దండయాత్ర కార్యక్రమం,అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వ్యవసాయ శాఖ అధికారి వల్లభనేని హరీష్ కుమార్ మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం ద్వారా వరి సాగు కష్టంగా ఉందని అన్నారు.

12 హెక్టార్లలో పత్తి సాగు జరుగుతుందని మొత్తం 4278 మెట్రిక్ టన్నుల ఎరువులు,1650 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని తెలిపారు.ఈ నెల 31వ తేదీ లోపు పత్తి వేసిన రైతులు ఎకరానికి 1983 రూపాయలు బీమా చెల్లించి ఈక్రాప్ నమోదు చేయించుకోవాలని అన్నారు.వరి సాగు చేసేవారు 300 రూపాయలు బీమా ఆగస్టు 15వ తేదీ లోపు చెల్లించాలని తెలిపారు.ఈ అనంతరం 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా మండల పరిషత్ ఆవరణలో నూతనంగా 30 లక్షలతో నిర్మించిన సిసి రహదారులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీడీవో టి.సరస్వతి,తహసీల్దార్ వి.రాజాకుమారి,జడ్పిటిసి కోట శామ్యూల్, ఎంపిటిసిలు, సంబంధిత శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.