చిట్యాల ప్రధాన రహదారిపై వరద నీరు
సైడ్ డ్రైనేజీలు లేక వాహనదారులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు
చిట్యాల, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని చిట్యాల–మొగుళ్లపల్లి ప్రధాన రహదారికి ఇరువైపులా సైడ్ డ్రైనేజీ కాలువలు లేకపోవడంతో బుధవారం కురిసిన భారీ వర్షానికి వరద నీరు రోడ్డుపై చేరింది.
దీంతో రహదారిపై ప్రయాణించే వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు ప్రభుత్వ కళాశాల, వ్యాపార దుకాణాల పరిసరాలు, సింగిల్ విండో కార్యాలయ ఆవరణలో కూడా నిలిచిపోయింది.

ప్రధాన రహదారిపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని స్థానికులు తెలిపారు. ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చిట్యాల ప్రధాన రహదారికి ఇరువైపులా సైడ్ డ్రైనేజీ కాలువలు నిర్మించి, వర్షపు నీరు నిల్వకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.
