Nallagonda | మట్టి రోడ్డుకు మోక్షం…

Nallagonda | మట్టి రోడ్డుకు మోక్షం…
- శతాబ్ద కళ… నెరవేరనున్న వేళ
- జామచెట్ల బావి,కొండాపురం గ్రామస్తుల్లో ఆనందోత్సవాలు
- నేడు ఎమ్మెల్యే సామెల్ చేతుల మీదుగా బి టి రోడ్డుకు శంకుస్థాపన
- 1.5 కి.మీ మేర రూ.1 కోటి 75 లక్షలతో బి టి నిర్మాణం
మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని జామచెట్ల బావి, కొండాపురం గ్రామాలకు గత శతాబ్ద కాలంగా మట్టి రోడ్డే దిక్కయ్యింది. ఈ గ్రామాల్లో సుమారు 1000 మంది జనాభా, 700 ఓట్లు కలిగి ఉన్నాయి. ఇక్కడి ప్రజలు కేవలం వ్యవసాయ ఆధారితంగా జీవనం కొనసాగిస్తున్నారు. పలువురు యువకులు స్వయం ఉపాధి పనులు చేసుకుంటుండగా, కొంతమంది డ్రైవర్లు గా, ప్రభుత్వ ఉద్యోగులు గా, కూలీలుగా, చిరు వ్యాపారులుగా పట్టణానికి దూరంగా ప్రశాంత వాతావరణంలో తమ జీవనం కొనసాగిస్తున్నారు.
ఈ ప్రాంత ప్రజలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు , ప్రయాణికులు తమ నిత్య పనుల్లో భాగంగా ప్రయాణంలో గత శతాబ్ద కాలంగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. మోత్కూర్ మేజర్ గ్రామపంచాయతీలో ఉన్నప్పటికీ మట్టి రోడ్డుకి మోక్షం కలగలేదని.. కనీసం నూతన మున్సిపాలిటీ లో అయినా బిటి రోడ్డు ఏర్పడుతుందని ఎంతో ఆశగా చూసినప్పటికీ… మున్సిపాలిటీ తొలి పాలకవర్గ పాలనలో ఇక్కడి ప్రజలకు నిరాశే మిగిలింది.
ఈ ప్రాంతానికి చెందిన ధబ్బేటి సోమయ్య మోత్కూర్ సర్పంచ్ గా 10 సంవత్సరాలు పనిచేశారు.ఇదే ప్రాంతానికి చెందిన మడిపెళ్లి రంగయ్య, మన్నే మల్లయ్య,బీసు లింగయ్య,బీసు సత్తయ్య, బీసు పద్మ ,గనగాని శ్రీశైలం లు వార్డ్ మెంబర్ లుగా,ధబ్బేటి విజయ రమేష్ మోత్కూర్ మున్సిపాలిటీ లో తొలి కౌన్సిలర్ గా కొనసాగారు.
ఆ నాడే ప్రభుత్వం ఈ రెండు గ్రామాల్లో బడుగు బలహీన వర్గాలుగా గుర్తించి వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ,లే అవుట్ గా మార్చి నిరుపేదలకు గత 4 దశాబ్దాల క్రితం ప్రభుత్వ ప్లాట్లు కేటాయించారు.ఆ గృహల్లోనే ప్రస్తుతం వారు నివాసం ఉంటున్నారు.ఆయా ఎన్నికల్లో సర్పంచ్ ,వార్డ్ సభ్యుడు, ఎంపీటీసీ,కౌన్సిలర్,ఎమ్మెల్యే ,ఎంపీ పదవులకు పోటీ చేసిన ప్రతి నాయకుడు ఈ రోడ్డు నిర్మాణానికి హామీ ఇచ్చారే తప్ప…ఆచరణలో అమలు కాలేదు.
ఎట్టకేలకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ హయాంలో మున్సిపల్ నిధులు (టి యూ ఎఫ్ ఐ డి సి) రూ.1 కోటి 75 లక్షలతో 1.5 కి.మీ మేరకు జామచెట్ల బావి నుండి కొండాపురం వరకు బి టి రోడ్డు నిర్మాణం కోసం నేడు తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ చేతుల మీదుగా శంకుస్థాపన జరుగనుండడంతో ఈ గ్రామాల ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీ లో 9 వ వార్డు లోని ఈ గ్రామాలకు ప్రధానంగా బి టి రోడ్డు ..ప్రధాన సమస్యగా మిగిలగా…నేటితో ఈ గ్రామాల ప్రజల రోడ్డు కష్టాలు తీరనున్నాయి.రెండు గ్రామాల్లో వాటర్ ప్లాంట్ లు,సీసీ రోడ్లు,డ్రైనేజీలు కొంతమేరకు ఉన్నప్పటికీ ప్రజల సౌకర్యం కోసం మరిన్ని సీసీ రోడ్లు,డ్రైనేజీ లు ఏర్పాటు చేసి స్థానిక సమస్యలపై ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.
ఇక్కడి ప్రజలకు అంత్యక్రియల నిమిత్తం స్మశాన వాటిక సైతం ఏర్పాటు చేయాలని ,బిక్కేరు వాగులోకి వెళ్లే దారి కాస్త ఇటీవల వర్షాలకు పూర్తిగా దెబ్బతిని కనీసం బైక్ లు కూడా వెళ్లడంలేదని స్థానికులు, రైతులు వాపోతున్నారు. జామచెట్ల బావి క్రాస్ రోడ్డు నుండి గ్రామానికి వచ్చే రోడ్డు సైతం గుంతల మయంగా మారిందని, కల్వర్టు సైతం శిథిలావస్థకు చేరిందని ఎమ్మెల్యే చొరవ చూపి ఆ రోడ్డు,కల్వర్టు కి మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.
వేసవిలో ఈ గ్రామాలకు నీటి వసతి ఇబ్బందిగా మారిందని…త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.గ్రామాల్లో మెయిన్ రోడ్డు వెంట అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని,మోత్కూర్ – గుండాల రూట్లో బిక్కేరు వాగు పై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేయాలని ఎమ్మెల్యే సామెల్ కి విన్నవిస్తున్నారు.మున్సిపాలిటీలో అత్యంత వెనకబడిన ఈ రెండు గ్రామాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మరిన్ని నిధులు కేటాయించి,మున్సిపాలిటీ లోనే 9 వ వార్డ్ కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు..
