రోడ్డుపై ఉధృతంగా వరద నీరు
భోజన్నపేట మార్గంలో ప్రమాదకరంగా మారిన వాహనాల రాకపోకలు
పెద్దపల్లి, ఆంధ్రప్రభ: పెద్దపల్లి జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పెద్దపల్లి మండలం భోజన్నపేట రోడ్డుపై కాల్వ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
భారీ వర్షాల కారణంగా రోడ్డుపై ఉన్న కాల్వ పొంగిపొర్లి వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ద్విచక్ర వాహనాలు, కార్లు అత్యంత అప్రమత్తంగా రాకపోకలు సాగిస్తున్నాయి. మరికొందరు వాహనదారులు నీటి ఉధృతి తగ్గే వరకు అక్కడే వేచి చూస్తున్నారు.
ఇదిలా ఉండగా, కూనారం రైల్వే గేట్ మరమ్మత్తుల కారణంగా భోజన్నపేట మార్గంలో వాహనాల రాకపోకలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి రాకపోకలను తాత్కాలికంగా నియంత్రించాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను సూచించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
