జలాశయాలు జలకళ.. ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వరద!

  • ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్..
  • మరో రెండు రోజులు అతిభారీ వర్షాల హెచ్చరిక
  • కడెం, శ్రీపాద ఎల్లంపల్లి సహా ప్రధాన ప్రాజెక్టుల్లోకి భారీ ఇన్‌ఫ్లోలు..

సూపర్ ఎల్‌నినో ప్రభావంతో.. వానజాడే లేక తెలంగాణను ఎండలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. నైరుతి రుతుపవనాల రాక ఆలస్యమవడంతో వర్షాధారంగా సాగు చేసే రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. భూగర్భ జలాలు అడుగంటాయి.. చెరువులు, కుంటలు ఎండిపోయాయి.. పట్టణాల్లో తాగునీటి సమస్య మరింత తీవ్రమైంది. మండే ఎండలు నిప్పులు చెరిగేలా విరుచుకుపడటంతో ప్రజలు నరకయాతన అనుభవించారు. అయితే, గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న విస్తారమైన వర్షాలు ఎట్టకేలకు వర్షాకాలం మొదలైన భావన కలిగిస్తున్నాయి. జలాశయాలు మళ్లీ జలకళను సంతరించుకుంటుండగా.. ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది.

హైదరాబాద్, ఆంధ్రప్రభ : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. కడెం, శ్రీపాద ఎల్లంపల్లి, నిజాంసాగర్, జూరాల ప్రాజెక్టుల్లో వరద ప్రవాహం రోజురోజుకూ పెరుగుతోంది. ఇదే పరిస్థితి మరో రెండు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

కడెం ప్రాజెక్టుకు భారీ వరద..

నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం నీటిమట్టం 687.875 అడుగులకు చేరుకుంది. మొత్తం 3.495 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 1.313 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 20,100 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, కేవలం 67 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 68,150 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.

ఉధృతంగా ఎల్లంపల్లిలో ఇన్‌ఫ్లో..

పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. 20.175 టీఎంసీల పూర్తిస్థాయి సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం 10.436 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం 66,126 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా, హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 275 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఇంకా రెండు రోజులు భారీ వర్షాలు

తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించగా.. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జనగాం, కామారెడ్డి, ఖమ్మం, కుమురం భీం, మేడ్చల్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

వాగులు ఉప్పొంగి రాకపోకలు నిలిచివేత…

భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్ జిల్లా హవేలీఘనపూర్ మండలం దూప్‌సింగ్ తండా వాగు పొంగిపొర్లడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడుపాయల వనదుర్గ భవాని ఆలయం సమీపంలోని ఆనకట్ట అలుగు పారుతోంది. జగిత్యాల జిల్లాలో అనంతారం, నేరెళ్ల వాగులు జాతీయ రహదారిపై నుంచి ప్రవహించడంతో జగిత్యాల-ధర్మపురి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఆక్సాయిపల్లె-నాగారం రహదారి దెబ్బతినగా, పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరింది. జిల్లాలో గత 24 గంటల్లో 18.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

నిజాంసాగర్, జూరాలకు పెరుగుతున్న వరద

నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 6,585 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1,395.40 అడుగులు కాగా, 7.139 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూరాల ప్రాజెక్టులోకి 27 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుత నీటిమట్టం 317.240 మీటర్లు, నీటి నిల్వ 7.17 టీఎంసీలుగా నమోదైంది. వరద ప్రవాహాన్ని వినియోగించుకుంటూ ఎగువ, దిగువ జలవిద్యుత్ కేంద్రాల్లో కలిపి 395 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

హైదరాబాద్ కు అల‌ర్ట్ .!

హైదరాబాద్ నగరంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయే అవకాశం ఉన్నందున.. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఐటీ సంస్థలు ఉద్యోగులను ముందుగానే ఇళ్లకు పంపేలా చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు.