గోశాలల నిర్మాణానికి భూమి పూజ
బాసరలో వేద పాఠశాల, కృష్ణ మందిరంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
బాసర, ఆంధ్రప్రభ: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవి క్షేత్రంలోని కృష్ణ మందిరం, వేద పాఠశాల ప్రాంగణంలో గోశాలల నిర్మాణానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం భూమి పూజ నిర్వహించారు.
వ్యాస పౌర్ణిమ సందర్భంగా శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన గోశాల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ, వేద పాఠశాల కృష్ణ మందిరంలో గోశాల నిర్మాణానికి రూ.20 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో గోశాలల నిర్మాణానికి కృషి చేస్తామని చెప్పారు.
అనంతరం సరస్వతి శిశు మందిర్ పాఠశాల భవన నిర్మాణ పనులను ప్రారంభించి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు, నాయకులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
