రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
వర్షాకాలంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి:
రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్
బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. బుధవారం బిక్కనూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పలు వార్డులను సందర్శించి రోగులతో మాట్లాడి చికిత్స, వసతుల గురించి ఆరా తీశారు. ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న మందుల నిల్వలను కూడా పరిశీలించారు.
అనంతరం వైద్య సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో రవీందర్ నాయక్ మాట్లాడుతూ, వర్షాకాలం ముగిసే వరకు వైద్య సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. సీజనల్ వ్యాధుల నివారణకు ప్రతి గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అన్ని రకాల మందులు ఆస్పత్రిలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతి గ్రామంలో ఫీవర్ సర్వే, ఫ్రైడే అండ్ డ్రై డే కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించి వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఈ తనిఖీలో జిల్లా వైద్యాధికారి వెంకట్, మండల వైద్యాధికారి హేమీమా, ఆరోగ్య విస్తీర్ణ అధికారి వెంకటరమణ, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
