జిల్లా ఇంటర్ ఫలితాలు 66.19% ఉత్తీర్ణత

జిల్లా ఇంటర్ ఫలితాలు 66.19% ఉత్తీర్ణత

మొదటి సంవత్సరము ఉత్తీర్ణత 56.64%
ఒకేషనల్ విభాగంలో ఉత్తీర్ణత 67.68%
బాలికలదే పై చేయి

నిజామాబాద్ స్పోర్ట్స్, ఆంధ్రప్రభ : 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఉత్తీర్ణత శాతం పెరగడం గమనార్హం కాగా, బాలికలు మరోసారి బాలురపై పైచేయి సాధించారు.

జనరల్ విభాగం ఫలితాలు…

రెండవ సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం 13,876 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా, 9,187 మంది ఉత్తీర్ణులై 66.19% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 7,606 మంది హాజరై 5,823 మంది ఉత్తీర్ణులై 76.56% సాధించగా, బాలురు 6,273 మంది హాజరై 3,364 మంది మాత్రమే పాస్ అయి 53.63% సాధించారు. మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో 15,547 మంది హాజరుకాగా, 8,806 మంది పాస్ అయి 56.64% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 8,711 మంది హాజరై 5,868 మంది పాస్ అయి 67.36% సాధించగా, బాలురు 6,836 మంది హాజరై 2,938 మంది మాత్రమే పాస్ అయి 42.98% సాధించారు.

ఒకేషనల్ విభాగం ఫలితాలు…

ఒకేషనల్ విభాగంలో రెండవ సంవత్సరం 2,345 మంది హాజరుకాగా, 1,587 మంది ఉత్తీర్ణులై 67.68% ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలికలు 1,002 మంది హాజరై 843 మంది పాస్ అయి 84.13% సాధించగా, బాలురు 1,343 మంది హాజరై 744 మంది పాస్ అయి 55.40% సాధించారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 2,562 మంది హాజరుకాగా, 1,272 మంది ఉత్తీర్ణులై 49.69% ఉత్తీర్ణత నమోదైంది. ఇందులో బాలికలు 1,096 మంది హాజరై 789 మంది పాస్ అయి 71.99% సాధించగా, బాలురు 1,466 మంది హాజరై 483 మంది మాత్రమే పాస్ అయి 32.95% సాధించారు.

గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు..
జిల్లా విద్యాధికారి రవికుమార్..

గత విద్యా సంవత్సరం (2024-25)తో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. రెండవ సంవత్సరం ఉత్తీర్ణత శాతం 58.21% నుంచి 66.19%కు పెరిగింది. అలాగే మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 53.37% నుంచి 56.64%కు పెరిగింది. మొత్తంగా చూసినప్పుడు జిల్లాలో ఇంటర్ ఫలితాల్లో పురోగతి కనిపిస్తుండగా, అన్ని విభాగాల్లో బాలికలు మెరుగైన ఫలితాలు సాధించి తమ ఆధిపత్యాన్ని కొనసాగించారని జిల్లా కళాశాల విద్యాధికారి రవికుమార్ పేర్కొన్నారు.