అమరావతి క్రీడా పోటీలకు విద్యార్థుల ఎంపిక

జిల్లా స్థాయి పోటీలకు ఎల్‌హెచ్‌ఆర్ కళాశాల నుంచి 18 మంది అర్హత

మైలవరం, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి క్రీడా పోటీలు–2026 జిల్లా స్థాయి పోటీలకు మైలవరం నియోజకవర్గంలోని స్థానిక లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన 18 మంది విద్యార్థినీ, విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల శారీరక విద్యా విభాగం వెల్లడించింది.

ఎంపికైన వారిలో పురుషుల వాలీబాల్ విభాగంలో ఐదుగురు, పురుషుల కబడ్డీలో ఒకరు, మహిళల కబడ్డీలో ఇద్దరు, పురుషుల ఖోఖోలో ఒకరు, మహిళల ఖోఖోలో ఎనిమిది మంది, పురుషుల బ్యాడ్మింటన్‌లో ఒక క్రీడాకారుడు ప్రత్యామ్నాయ క్రీడాకారుడిగా ఎంపికయ్యారు.
స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ క్రీడా విభాగాల ఎంపిక పోటీల్లో కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రతిభ చాటడంతో జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక కావడం అభినందనీయమని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. మాధవి పేర్కొన్నారు.

జిల్లా స్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించి కళాశాలకు, ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.