AP | టీడీపీ దిమ్మ ధ్వంసంతో ఘర్షణ..
వైసీపీ–టీడీపీ రెబల్ వర్గాలపై టీడీపీ శ్రేణుల ఆరోపణలు..
పలువురికి గాయాలు..
గ్రామంలో 144 సెక్షన్ అమలు
AP |(నందిగామ రూరల్, ఆంధ్రప్రభ ) : చందర్లపాడు మండలం తుర్లపాడు గ్రామంలో టీడీపీ పార్టీ దిమ్మ ధ్వంసం ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. టీడీపీ దిమ్మను వైసీపీ, టీడీపీ రెబల్ వర్గాలు ధ్వంసం చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో గ్రామ టీడీపీ అధ్యక్షుడు దాసర ఏసు ప్రభుతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గ్రామంలో 144 సెక్షన్ అమలు చేశారు. టీడీపీ శ్రేణుల ఆరోపణల ప్రకారం, పోలీసుల సమక్షంలోనే పార్టీ దిమ్మను ధ్వంసం చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని పేర్కొన్నారు. ఘటనలో ఓ కానిస్టేబుల్ కూడా గాయపడినట్లు, ఆయనకు గోప్యంగా చికిత్స అందిస్తున్నారని ఆరోపించారు.
ఈనెల 22న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా ఆవిష్కరించిన టీడీపీ పార్టీ దిమ్మను ధ్వంసం చేసేందుకు వచ్చిన వైసీపీ, టీడీపీ రెబల్ వర్గాలను అడ్డుకునే క్రమంలో ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు టీడీపీ నాయకులు తెలిపారు. మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్, ఎన్ఎస్పీ లెఫ్ట్ కెనాల్ అధ్యక్షుడు వీరబాబు ప్రోత్సాహంతోనే ఈ ఘటన జరిగిందని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. ఇటీవల టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వైసీపీతో కలిసి వేదికలు పంచుకోవద్దని పార్టీ నాయకులకు సూచించినప్పటికీ, తుర్లపాడులో కొందరు మండల నాయకులు వైసీపీతో కలిసి వ్యవహరించడంపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పార్టీ అధిష్ఠానం వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
