ఖాజీపాలెంలో కవి పుంగవుల విగ్రహాల ఆవిష్కరణ
బాపట్ల, ఆంధ్రప్రభ: బాపట్ల జిల్లా ఖాజీపాలెంలోని కేవీఆర్, ఎంకేఆర్ కళాశాలలో బుధవారం కవి పుంగవుల నూతన విగ్రహాల ఆవిష్కరణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, ప్రముఖ సినీ నటుడు, రచయిత తనికెళ్ల భరణి, అజో-విభో-కందాళం ఫౌండేషన్ అధ్యక్షులు ఆచార్య అప్పాజ్యోస్యుల సత్యనారాయణ, పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్ తదితరులు పాల్గొన్నారు.
వ్యాస పూర్ణిమ సందర్భంగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ శ్రీ వేదవ్యాస మహర్షి, తిక్కన సోమయాజి విగ్రహాలను ఆవిష్కరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదికవి నన్నయ విగ్రహాన్ని ఆచార్య అప్పాజ్యోస్యుల సత్యనారాయణ, ఎర్రాప్రగడ విగ్రహాన్ని తనికెళ్ల భరణి, బమ్మెర పోతన విగ్రహాన్ని డాక్టర్ మేడసాని మోహన్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ రామాయణం, మహాభారతం, భాగవతం భారతీయ సంస్కృతికి మూలాధారాలని అన్నారు. వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని ప్రపంచానికి అందించిన మహనీయుడని, నన్నయ, తిక్కన, ఎర్రన త్రయం తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారని, బమ్మెర పోతన భాగవత రచనతో తెలుగు నేలను పునీతం చేశారని కొనియాడారు. విద్యతో పాటు సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడంలో కళాశాల యాజమాన్యం చేస్తున్న కృషిని అభినందించారు. ఖాజీపాలెం మంతెన వెంకటరాజు సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు దాతలు కవి పుంగవుల విగ్రహాలను బహూకరించారు.
