నేడు, రేపు అతి భారీ వర్షాల అవకాశం
అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్‌కు వెంటనే సమాచారం ఇవ్వాలి: కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల ప్రతినిధి, ఆంధ్రప్రభ: వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు జూలై 29, 30 తేదీల్లో జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు.
బుధవారం ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు కలెక్టరేట్‌లో 24 గంటల పాటు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసర అవసరాలు మినహా ప్రజలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు.
వాగులు, వంకలు, చెరువులు, అధిక నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. వర్షాల కారణంగా ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేదా ఇబ్బందులు ఎదురైనా వెంటనే 7989193131 నంబర్‌కు సమాచారం అందించాలని కోరారు.
కంట్రోల్ రూమ్‌కు అందిన ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాఖల అధికారులు వెంటనే స్పందించి అవసరమైన సహాయక చర్యలు చేపడతారని కలెక్టర్ తెలిపారు. ప్రజలు అధికార యంత్రాంగం సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ, వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తమ ప్రాణ, ఆస్తులను కాపాడుకునేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
