Shashi-Rule-Violations :ఊరూర శశి దందా..!? Andhra Prabha Top Story
Shashi-Rule-Violations :ఊరూర శశి దందా..!? Andhra Prabha Top Story
- కార్పొరేటు బురఖా
- బ్రాంచిల పేరుతో దోపిడీ
- నిబంధనలన్నీ గాలికే
- అపార్టుమెంటు భవనాల్లో క్లాసులు
- ప్రశ్నార్ధకంగా విద్యార్థుల భద్రత
- పట్టించుకోని ఇంటర్మీడియట్ బోర్డు
( నిఘా విభాగం, ఆంధ్రప్రభ )

శశి విద్యాసంస్థ నిబంధనలను తుంగలో తొక్కి విద్యను వ్యాపారంగా మార్చేస్తుంది. ఎన్ని నిబంధనలో ఉన్న అవన్నీ మాకు వర్తించవ అన్నట్లుగా వ్యవహరిస్తుంది. నిబంధనలను తమకు అనుకూలంగా మార్చేసుకుంటూ, విద్యాశాఖ, ఇతర శాఖ అధికారులకు తమను ప్రశ్నించ లేనంత స్థాయిలో శశి జులం ప్రదర్శిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ప్రాంతాల్లో శశి విద్యాసంస్థలు నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమ విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన చట్టాలను, నిబంధనలను పక్కనపెట్టి తరగతులు నిర్వహించడం, భారీ ఫీజులు వసూలు చేయడం, విద్యార్థుల భద్రతపై నిర్లక్ష్యం చూపడం వంటి ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. నిరంకుశ వైఖరి తో ఉన్న శశి విద్యాసంస్థల వ్యవహారంపై విద్యార్థి సంఘాల నాయకులు పలుమార్లు నిరసన తెలిపినా, ఫిర్యాదులు చేసిన సంబంధిత విద్యాశాఖ అధికారులకు కనీసం పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి సరిపెడుతున్నారనేది బహిరంగ రహస్యం అని విమర్శలు వినిపిస్తున్నాయి.
Shashi-Rule-Violations : టైమ్‌తో పని లేదు

శశి జూనియర్ కళాశాలల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తరగతులు నిర్వహిస్తున్నారు. సమయపాలన, సెలవు రోజులను వీరు పట్టించుకున్న దాఖలాలు తక్కువగా ఉంటాయి. శశి శశి స్కూల్స్, జూనియర్ కళాశాలలో తమ నిర్ణయమే నిబంధనలు అన్నట్లుగా తమకు నచ్చినట్లుగా సమయపాలన పాటించకుండా తరగతులు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల శారీరక మానసిక ఆరోగ్యం పై కనీస శ్రద్ధ వీరికి కనిపించదు. ర్యాంకులు వేట, మార్కుల కోసం పరుగులు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. ర్యాంకుల కోసం చదువులో చురుకైన విద్యార్థులను ప్రత్యేకంగా సెక్షన్లవారిగా కేటాయించి వారిపైనే ప్రత్యేక దృష్టి పెట్టి వారి నుంచే ర్యాంకులు రాబట్టేలా ఇక్కడ ఒత్తిడి తెస్తూ ఉంటారు. సాధారణ, మధ్యతరగతి విద్యార్థులపై వీరు పెట్టే శ్రద్ధ మాత్రం అంతంత మాత్రమే. ఒత్తిడితో కూడిన చదువుల కారణంగా ఎంతో మంది విద్యార్థులు మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Shashi-Rule-Violations : ఫీజుల పిండుడులో దిట్ట

శశి విద్యాసంస్థల్లో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు ఎక్కడ స్పష్టమైన బోర్డులు కనిపించవు. స్కూల్, కాలేజీ ఫీజు, బస్సు ఫీజు, పుస్తకాలు, విద్యా సామాగ్రి పేరుతో భారీ మొత్తాలు వసూలు చేస్తూ విద్యను కేవలం వాణిజ్య వస్తువుగా మార్చేశారు. ఎవరైనా ఫీజు వస్తువులపై నిబంధనలు పట్టవా అని ప్రశ్నిస్తే వారు తమ బలాన్ని, తమ అహంకారాన్ని వారిపై చూపెడుతూ ఉంటారు. ఎవరు ఎన్ని ఫిర్యాదులు తమపై చేసుకున్న తమకు పై స్థాయి నుంచి అండదండలు ఉన్నాయంటూ బెదిరింపులు కు పాల్పడుతూ ఉంటారు. తమ విద్యా వ్యాపారానికి అడ్డువస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరికలు ప్రత్యక్షంగా, పరోక్షంగా జారీ చేస్తూ ఉంటారు.
Shashi-Rule-Violations : విద్యార్థుల భద్రత ప్రశ్నార్ధకమే..?

శశి విద్య వ్యాపారంలో లాభాలే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉంటారు. ఇక్కడ చదివే విద్యార్థుల భద్రతకు, వారు కల్పించే సౌకర్యాలపై కనీస శ్రద్ధ తీసుకున్న దాఖలాలు కనిపించవు. హాస్టళ్లు, క్యాంపస్ భద్రత, మౌలిక సదుపాయాల విషయంలో లోపాలు ఉన్నట్లు ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అపార్ట్మెంట్ తరహా భవనాల్లో, ఇరుకు గదుల్లో విద్యాబోధన సాగిస్తున్నారు.ప్రభుత్వ అధికారుల నుంచి అండదండలు పుష్కలంగా ఉండటంతో ఈ అక్రమాలు మరింత విస్తృతమవుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా శశి విద్యాసంస్థల విద్యా వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
