25Thousand | గుజరాత్‌ను వణికించిన మహిళ కిరాతకం!

25Thousand | గుజరాత్‌ను వణికించిన మహిళ కిరాతకం!
25Thousand | వివాహేతర సంబంధం నుంచి దారుణ హత్య వరకు
రూ.25 వేల సుపారీ.. కానీ కిల్లర్ ట్విస్ట్
భర్త బతికే ఉండటంతో బయటపడిన మోసం
కాలువలో మృతదేహం.. ఎనిమిది నెలల తర్వాత ఛేదించిన పోలీసులు
25Thousand | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; సినిమా స్క్రిప్ట్‌ను మించిన ట్విస్టులు.. ఊహకందని వరుస మోసాలు.. ఒకే కుటుంబంలో మొదలైన నిషిద్ధ ప్రేమకథ చివరకు దారుణ హత్యతో ముగిసింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన ఓ మహిళ కథ ఇది. ఈ కేసు అసలు సీక్రెట్ తెలిసి గుజరాత్ లోని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులే షాకయ్యారు! ఈ మర్డర్ మిస్టరీ పూర్తి వివరాల్లోకి వెళ్తే…
గుజరాత్‌లోని సురేంద్రనగర్ జిల్లాకు చెందిన జాగృతి గోస్వామికి, సుఖదేవగిరి గోస్వామితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లకు ఆమె తన భర్త అన్న శాంతిగిరి గోస్వామితో ప్రేమలో పడింది. దీంతో మొదటి భర్తను, కన్న పిల్లలను వదిలేసి శాంతిగిరితో కలిసి వెళ్లిపోయింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుని మరో గ్రామంలో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
శాంతిగిరి వృత్తిరీత్యా ట్రక్ డ్రైవర్ కావడంతో వారాల తరబడి ఇంటికి దూరంగా ఉండేవాడు. ఈ క్రమంలో జాగృతి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకుని కాంతిలాల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వీరి బంధం ఎంతగా ముదిరిందంటే, కాంతిలాల్ ఆ జంట ఇంటి పక్కనే ఒక ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నాడు. కొన్నాళ్లకు వీరిద్దరికీ శాంతిగిరి అడ్డంకిగా మారడంతో, అతడిని ఎలాగైనా చంపేయాలని పథకం వేశారు.
శాంతిగిరిని చంపడానికి జాగృతి, కాంతిలాల్‌లు ‘యూనీస్’ అనే వ్యక్తిని రూ. 25,000 సుపారీ ఇచ్చారు. పథకం ప్రకారం.. ఓ రాత్రి యూనస్ శాంతిగిరి హత్య చేసేందుకు ఇంట్లోకి చొరబడ్డాడు. కానీ, గాఢ నిద్రలో ఉన్న శాంతిగిరిని చూసి చంపడానికి ధైర్యం సరిపోలేదు. దీంతో అతడు నిద్రపోతున్న శాంతిగిరి ఫోటోను తన మొబైల్‌లో తీసి, “నేను పని ముగించేశాను, అతడు చనిపోయాడు” అని జాగృతికి పంపాడు. ఆ ఫోటో చూసి భర్త నిజంగానే చనిపోయాడని నమ్మిన జాగృతి, యూనస్‌కు ఒప్పందం ప్రకారం డబ్బులు చెల్లించేసింది. అయితే, మరుసటి రోజు ఉదయం శాంతిగిరి లేచి తిరుగుతుండటం చూసి ఆమె మైండ్ బ్లాంక్ అయింది.
యూనస్ మోసం చేశాడని అర్థం చేసుకోని ఈసారి ఎలాగైనా తామే స్వయంగా పని ముగించాలని డిసైడ్ అయ్యారు. ఓ రోజు రాత్రి కాంతిలాల్, జాగృతి, శాంతిగిరి గొంతు నులమి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గదిలోని మంచం వెనుక దాచిపెట్టారు.
మృతదేహాన్ని మాయం చేయడానికి జాగృతి.. ‘దీపక్’ (అలియాస్ మున్నా) అనే మరో వ్యక్తి సహాయం కోరింది. పోలీసుల సమాచారం ప్రకారం దీపక్‌తో కూడా ఈమెకు ప్రేమ సంబంధం ఉందని వెల్లడించారు. దీపక్ ఒక కారును ఏర్పాటు చేయగా, ఆ ముగ్గురు కలిసి శాంతిగిరి మృతదేహాన్ని సురేంద్రనగర్‌లోని ఒక కాలువలో పడేశారు. అది ప్రమాదవశాత్తు జరిగి నీటిలో మునిగి చనిపోయినట్లు చిత్రికరించారు. ఆ తర్వాత బంధువులు, చుట్టుపక్కల వారు శాంతిగిరి గురించి అడిగితే.. అతనికి వేరే చోట కొత్త ఉద్యోగం దొరికిందని, ఫోన్ నంబర్ కూడా మార్చేసి దూరంగా వెళ్ళిపోయాడని నమ్మబలికారు.

అయితే గుజరాత్ లోని సురేంద్రనగర్ లోని కాలువలో గత ఏడాది శాంతగిరి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు దాదాపు ఎనిమిది నెలల పాటు ఈ కేసు ఒక మిస్టరీగానే ఉండిపోయింది. అయితే, ఇటీవల అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఆ మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని నమ్మదగిన సమాచారం రావడంతో రంగంలోకి దిగారు. ప్రత్యేక బృందాలుగా మారి రెండు నెలల పాటు పకడ్బందీగా దర్యాప్తు జరిపి, ఈ ఘోర హత్య వెనుక ఉన్న నిందితులు జాగృతి, కాంతిలాల్‌లను అరెస్టు చేసి విచారణ చేపట్టగా ఈ హత్య ఉదాంతం బయటపడింది. అలాగే మృతదేహాన్ని దాచడంలో సహాయం చేసిన మూడో ప్రియుడు దీపక్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
