ఊట్కూర్‌లో భారీ కార్డెన్ సెర్చ్.. 42 వాహనాలు సీజ్
ఊట్కూర్ (ఆంధ్రప్రభ): నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల కదలికలపై నిఘా ఉంచడమే లక్ష్యంగా కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు నారాయణపేట డీఎస్పీ నల్లపు లింగయ్య తెలిపారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు బుధవారం ఊట్కూర్ మండల కేంద్రంలో పోలీసులు భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ప్రజల రక్షణ కోసమే ఈ తనిఖీలు చేపడుతున్నామని, ఎలాంటి భయాందోళనకు గురికాకుండా పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
తనిఖీల్లో భాగంగా మండల కేంద్రంలోని ప్రతి వీధిని జల్లెడ పట్టిన పోలీసులు ఇళ్లు, అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. చట్టబద్ధమైన పత్రాలు లేని 39 ద్విచక్ర వాహనాలు, రెండు ఆటోలు, ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్డెన్ సెర్చ్‌లో నారాయణపేట సీఐ శివశంకర్, మక్తల్ సీఐ రామ్‌లాల్, ఊట్కూర్ ఎస్ఐ రమేష్‌తో పాటు మరో ఐదుగురు ఎస్ఐలు, పెద్ద సంఖ్యలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
