విద్యార్థుల భవిష్యత్తు, దేశ హితం కోసమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా

బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య వ్యాఖ్యలు

మక్తల్ ఆంధ్రప్రభ : కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే నిర్ణయం విద్యార్థుల భవిష్యత్తుకు, దేశ హితానికి ప్రాధాన్యత ఇవ్వాలనే సందేశాన్ని ఇచ్చిందని మక్తల్ మాజీ ఎంపీపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య అన్నారు.

విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్‌కు నీట్ పేపర్ లీక్‌లో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. అయినప్పటికీ విద్యార్థులకు ఆయన బహిరంగంగా క్షమాపణలు చెప్పారని గుర్తు చేశారు.

సోమవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన కొండయ్య.. త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విపక్ష పార్టీలు విద్యార్థి ఉద్యమంలోకి ప్రవేశించి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు.

విద్యార్థుల భవిష్యత్తు, వారి కుటుంబాల నమ్మకం, దేశ ప్రయోజనాలు మంత్రి పదవి కంటే గొప్పవని ధర్మేంద్ర ప్రధాన్ తన వైఖరి ద్వారా చాటారని పేర్కొన్నారు.

నీట్ పరీక్షల అంశంపై దేశవ్యాప్తంగా విద్యార్థులు వ్యక్తం చేసిన ఆందోళనలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా పరిగణించిందన్నారు. విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

నీట్ పరీక్షల పేరుతో జరిగిన నిరసనల్లో కొందరు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించిందని కొండయ్య అన్నారు.

బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాల్లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రజలు గమనించారని, అలాంటి పరిస్థితులు భారత్‌లో తలెత్తకుండా ప్రజాస్వామ్యాన్ని, దేశ భద్రతను కాపాడుతూ కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

గత ప్రభుత్వాల హయాంలో అనేక రాష్ట్రాల్లో పేపర్ లీక్‌లు జరిగినా, ఆరోపణలు వచ్చినా దోషులపై చర్యలు తీసుకోలేదని విమర్శించారు. విద్యార్థుల విశ్వాసాన్ని పొందే విధంగా చర్యలు చేపట్టలేదని, అప్పటి విద్యాశాఖ మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేదని ఆరోపించారు.

నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని కొండయ్య పేర్కొన్నారు.

రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, ఆరోగ్యం, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన వంటి అన్ని రంగాల్లో కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. బీజేపీకి అవకాశం ఇచ్చిన రాష్ట్రాల్లో అభివృద్ధి, పారదర్శక పాలన కొనసాగుతోందని తెలిపారు.

రాబోయే తెలంగాణ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై విశ్వాసం ఉంచి బీజేపీకి అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలకు కొండయ్య పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే విద్య, ఉపాధి, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని ఆయన అన్నారు.