భద్రతతో ఉత్పత్తి లక్ష్యాలు సాధించాలి
రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్టుల్లో డైరెక్టర్ (ఆపరేషన్స్) సూర్యనారాయణ పర్యటన
రామగిరి, ఆంధ్రప్రభ: నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలను భద్రతతో సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ అధికారులకు సూచించారు.
మంగళవారం ఆయన సింగరేణి రామగుండం-3 ఏరియా, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంలో రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం ఆర్జీ-3, ఏపీఏ ఏరియాల జనరల్ మేనేజర్లు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా, జీడీకే-10 గని పనుల పురోగతి, ఆర్‌కోల్ మైన్ తదితర అంశాలపై చర్చించారు.
తదుపరి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్ గనిని సందర్శించిన డైరెక్టర్, మూడో ప్యానెల్ సాల్వేజింగ్ పనుల పురోగతి, నాలుగో ప్యానెల్ తయారీ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ, నిర్దేశించిన ఓబీ, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చి సాధించాలని సూచించారు. అందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని, వర్షాకాలంలో ఉపరితల గనుల్లో తీసుకోవాల్సిన భద్రతా చర్యలను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.
అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌లో సాల్వేజింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి, భద్రతతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌వోటు జీఎం బండి సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్ వి. ఫ్యాటింగ్, ప్రాజెక్ట్ ఇంజినీర్ టి. రఘురామ్‌తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
