నల్లమల్ల నిర్వాసితులకు త్వరగా పునరావాసం కల్పించాలి

  • బాచారం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో 257 ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలి
  • జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో అధికారులకు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ ఆదేశాలు

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న నిర్వాసిత కుటుంబాలకు పునరావాస కార్యక్రమాలను వేగంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. పెద్దకొత్తపల్లి మండలం బాచారం గ్రామ సమీపంలో ఏర్పాటు చేయనున్న రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్‌మెంట్ (ఆర్‌అండ్‌ఆర్) కాలనీ అభివృద్ధి పనులపై సోమవారం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు.

నల్లమల్ల అటవీ ప్రాంతం నుంచి తొలి విడతలో తరలించనున్న ఐదు గ్రామాలకు చెందిన 257 కుటుంబాల కోసం నిర్మించనున్న గృహాల పనులను ఎలాంటి జాప్యం లేకుండా ప్రారంభించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. టెండర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, అర్హత కలిగిన నిర్మాణ సంస్థను ఎంపిక చేసి, నిర్ణీత గడువులో నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

నిర్వాసిత కుటుంబాలకు గృహాలతో పాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని, వారి జీవనోపాధికి ఇబ్బందులు తలెత్తకుండా వ్యవసాయ భూముల కేటాయింపు ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ అధికారులకు సూచించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు ఇప్పటివరకు చేపట్టిన అభివృద్ధి పనులు, అంచనాల ప్రతిపాదనలు, భవిష్యత్ కార్యాచరణపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి రేవంత్ చంద్ర, అదనపు కలెక్టర్ బి. చిన్నయ్య, కొల్లాపూర్ ఆర్డీవో బన్సీలాల్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.