షార్ట్ సర్క్యూట్తో దగ్ధమైన ఇస్త్రీ డబ్బా..
జీవనాధారం కోల్పోయిన బాధితుడు.. విలువైన బట్టలు అగ్నికి ఆహుతి
భీమారం, ఆంధ్రప్రభ: షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇస్త్రీ డబ్బా దగ్ధమైన ఘటన గ్రేటర్ పరిధిలోని 55వ డివిజన్ భీమారం కాకతీయ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది.
బాధితుడు శాగంటి సంపత్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రతిరోజులాగే సోమవారం రాత్రి ఇస్త్రీ చేసిన బట్టలు, ఇస్త్రీ పెట్టెను డబ్బాలో ఉంచి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా డబ్బాలో మంటలు చెలరేగాయి.
మంటలను గమనించిన స్థానికులు వెంటనే కేయూ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ ఇంజన్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది.
అయితే అప్పటికే ఇస్త్రీ డబ్బాలో ఉన్న వినియోగదారుల విలువైన పట్టు చీరలు, ఇతర బట్టలు పూర్తిగా కాలిపోయాయి. దీంతో బాధితుడికి గణనీయమైన నష్టం వాటిల్లింది.
తన జీవనాధారమైన ఇస్త్రీ డబ్బా అగ్నికి ఆహుతి కావడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని శాగంటి సంపత్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, దాతలు తనకు సహాయం చేసి ఆదుకోవాలని ఆయన కోరారు.
