వడ్ల కొనుగోలు కేంద్రంలో అక్రమాలు – బీజేపీ ఆగ్రహం…

వడ్ల కొనుగోలు కేంద్రంలో అక్రమాలు – బీజేపీ ఆగ్రహం…

బెజ్జంకి, ఆంధ్రప్రభ : బెజ్జంకి మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై బీజేపీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆకస్మికంగా కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి పరిస్థితులను పరిశీలించారు. రైతులతో మాట్లాడిన వారు, కొనుగోలు కేంద్రంలో తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రైతులు శ్రమపడి పండించిన, నాణ్యమైన ‘ఏ’ గ్రేడ్ వడ్లను కూడా అధికారులు కావాలనే ‘బి’ గ్రేడ్‌గా నమోదు చేసి తక్కువ ధర చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2025-26 వానాకాలానికి ప్రకటించిన మద్దతు ధర ప్రకారం ‘ఏ’ గ్రేడ్ వడ్లకు క్వింటాల్‌కు రూ.2,389, కామన్ గ్రేడ్ వడ్లకు రూ.2,369 చెల్లించాల్సి ఉన్నప్పటికీ, ఇక్కడ ఆ రేట్లు అమలు కావడం లేదని వారు విమర్శించారు. ‘ఏ’ గ్రేడ్ వడ్లకు క్వింటాల్‌కు రూ.2,389 చెల్లించేలా వెంటనే ఆదేశాలు ఇవ్వాలన్నారు.

నాణ్యత పరీక్షలు రైతు సమక్షంలో పారదర్శకంగా నిర్వహించాలి కాంటా, హమాలీ పేరుతో అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాల ఎదుట నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బుర్ర మల్లేశం గౌడ్, మండల నాయకులు, కిసాన్ మోర్చా కార్యకర్తలు, స్థానిక రైతులు పాల్గొన్నారు.

Leave a Reply