ఎల్‌నీనో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటలపై సూచనలు

ఖానాపూర్ రూరల్, ఆంధ్రప్రభ: ఎల్‌నీనో ప్రభావం, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో తగ్గుతున్న నీటి నిల్వల నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. మంగళవారం ఖానాపూర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ (ఏడీఏ) సుజాత, మండల వ్యవసాయ అధికారి జగదీశ్వర్, వ్యవసాయ విస్తరణ అధికారి చందన బాదనకుర్తి గ్రామంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో ఎల్‌నీనో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున వరి సాగుపై పూర్తిగా ఆధారపడవద్దని సూచించారు.

రైతులు పరిస్థితులను అంచనా వేసుకుని తక్కువ నీటితో సాగయ్యే కంది, పెసర, మినుము వంటి ఆరుతడి పంటలతో పాటు జొన్న, సజ్జ వంటి చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యానవన పంటలను సాగు చేయాలని అధికారులు సూచించారు. వర్షపాతం, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలని, రైతులకు నష్టాలు తగ్గించడమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.