డీఎస్సీ అక్రమాలపై పోరాటం కొనసాగిస్తాం..
లోకేష్ రాజీనామా చేయాలి
విజయానంద రెడ్డి, డాక్టర్ సునీల్
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : మెగా డీఎస్సీలో అక్రమాలు, పేపర్ లీకేజీ జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం చిత్తూరులో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. చిత్తూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం నిర్వహించిన సభలో ఇద్దరు నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిందని ఆరోపించారు. సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మెరిట్ సాధించిన పేద డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, అక్రమాలకు పాల్పడి అర్హత లేని వారికి ఉద్యోగాలు కల్పించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమంగా ఉద్యోగాలు పొందిన వారిని తొలగించి, అర్హులైన నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. న్యాయం జరిగే వరకు యువజన, విద్యార్థి, సోషల్ మీడియా విభాగాలతో కలిసి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

కేంద్రంలో నీట్ పరీక్ష వ్యవహారంలో బాధ్యత వహించినట్లు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో, అదే తరహాలో రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై లోకేష్ కూడా నైతిక బాధ్యత తీసుకోవాలని విజయానంద రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరుగుతోందని, ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
చిత్తూరు అభివృద్ధి విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరుకు విశ్వవిద్యాలయం, అడవిపల్లి రిజర్వాయర్ తదితర హామీలు ఇచ్చినా అమలు కాలేదన్నారు. కమర్షియల్ టాక్స్ కమిషనరేట్, ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయాలను తిరుపతికి తరలించడం వల్ల వందలాది మంది ఉద్యోగులు చిత్తూరును వీడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు తరలిపోతే చిత్తూరు ప్రాధాన్యం కోల్పోయి అనాథ జిల్లాగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, ఉన్న కార్యాలయాలను కాపాడేందుకు ప్రజలతో కలిసి పోరాడతామని తెలిపారు.

పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ మాట్లాడుతూ… కేంద్రంలో నీట్ పరీక్ష వ్యవహారంపై ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించినట్లే, రాష్ట్రంలో డీఎస్సీ అక్రమాలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ నియామకాలలో అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, అర్హత లేని వారికి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చారనే అంశాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధారాలతో ప్రజల ముందుకు తీసుకొచ్చిందని అన్నారు. ఎన్నో సంవత్సరాలు కష్టపడి పరీక్షలకు సిద్ధమైన అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
