రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు

  • బిఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు

దండేపల్లి, ఆంధ్రప్రభ : రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ రావు హెచ్చరించారు. సోమవారం దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా విజిత్ రావు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీల్లో ఒక్కటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అందించిన పెట్టుబడి సాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆరోపించారు.

ఏకకాలంలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఆంక్షలు విధించి రైతులను మోసం చేశారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

తరుగు పేరుతో ఐదు కిలోల ధాన్యం కోత విధించడం, హమాలీ, లోడింగ్ చార్జీల పేరుతో రైతులపై అదనపు భారం మోపడం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు స్వర్గం చూపిస్తామని చెప్పి, ప్రస్తుతం రైతులు తమ హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతు సంక్షేమాన్ని విస్మరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డట్టేనని హెచ్చరించిన ఆయన, ఇప్పటికైనా ప్రభుత్వం మొండివైఖరిని వీడి రైతులకు రావాల్సిన అన్ని బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.

నకిలీ ట్రక్ షీట్ల ద్వారా లక్షల రూపాయల అవకతవకలు జరిగాయని ఆరోపించిన విజిత్ రావు, ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, నాయకులు గోట్ల భూమన్న యాదవ్, అఖిల్, అల్లంల సంతోష్ యాదవ్, నక్క తిరుపతి, అజయ్ గౌడ్, సుధాకర్, పత్తిపాక శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.