ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాలకు ఆగస్టు 7 వరకు అవకాశం

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచన

కరీమాబాద్, ఆంధ్రప్రభ: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026–2027 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల గడువు ఆగస్టు 7వ తేదీ వరకు ఉందని నగరంలోని సీకేఎం ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ. పోషయ్య తెలిపారు.

మంగళవారం కళాశాల ప్రాంగణంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీ. పోషయ్య, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ఎల్.వి. వరప్రసాద్ రావు, అభ్యాసకుల సహాయ కేంద్రం కోఆర్డినేటర్ ఎస్. అనిల్ కుమార్ డిగ్రీ ప్రవేశాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ పోషయ్య మాట్లాడుతూ, ఇంటర్, ఓపెన్ ఇంటర్, రెండేళ్ల ఐటీఐ లేదా డిప్లొమా పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 7లోపు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.

ఆన్‌లైన్ నమోదు అనంతరం సంబంధిత ధ్రువపత్రాలతో సహాయ కేంద్రానికి వచ్చి సర్టిఫికెట్ల ధ్రువీకరణ పూర్తి చేసి, నిర్ణయించిన ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా డిగ్రీ ప్రవేశం పొందవచ్చని తెలిపారు.

ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని, అలాగే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కెప్టెన్ డాక్టర్ సతీష్, డాక్టర్ అయేషా, డాక్టర్ వాసుధ, వెంకటేశ్వర్లు, సరిత, ఇతర అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.