న్యాయవాది రామిరెడ్డి సేవలు సమాజానికి ఆదర్శం

రామాలయ నిర్మాణానికి రూ.2 లక్షల విరాళం అందజేసిన హైకోర్టు న్యాయవాది

బిక్కనూరు, ఆంధ్రప్రభ: బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన హైకోర్టు ప్రముఖ న్యాయవాది పెద్దబచ్చగారి రామిరెడ్డి అందిస్తున్న సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కామారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి అన్నారు.

మండలంలోని రామేశ్వరపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రామాలయానికి న్యాయవాది రామిరెడ్డి తన వంతుగా రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ రెడ్డి ఆయనను శాలువాతో సత్కరించి అభినందించారు.

అనంతరం మాట్లాడుతూ, న్యాయవాది రామిరెడ్డి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందంజలో ఉంటున్నారని కొనియాడారు. మండల కేంద్రంలోని సిద్ధిరామేశ్వర ఆలయ అభివృద్ధికి కూడా ఆయన గణనీయమైన ఆర్థిక సహాయం అందించిన విషయాన్ని గుర్తు చేశారు.

సమాజంలో ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అండగా నిలుస్తూ, ధైర్యాన్ని నింపే వ్యక్తిగా రామిరెడ్డి గుర్తింపు పొందారని తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలని ఆకాంక్షిస్తూ, వారి కుటుంబం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించారు.