Telangana PCC | మీనాక్షి నటరాజన్ సంతృప్తి
పార్టీ సంస్థాగత కార్యక్రమాలను ప్రశంసించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో కార్యక్రమాల అమలుపై అభినందనలు
గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు పార్టీ బలోపేతమే లక్ష్యమని వెల్లడి
Telangana PCC | ఆంధ్రప్రభ వెబ్డెస్క్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) చేపడుతున్న సంస్థాగత కార్యక్రమాలు, శిక్షణా కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలపై ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ సంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో పార్టీ కార్యక్రమాలు సమర్థవంతంగా కొనసాగుతున్నాయని ఆమె అభినందించారు.
గాంధీ భవన్లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించిన మీనాక్షి నటరాజన్.. ఏఐసీసీ పిలుపు మేరకు చేపట్టిన సంఘటన్ సృజన్ అభియాన్, జై బాపు–జై భీమ్–జై సంవిధాన్ కార్యక్రమాలు, డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరాలు, ఎస్ఐఆర్ శిక్షణ, బూత్ స్థాయి ఏజెంట్ల (బీఎల్ఏ) నియామకాలు, డీసీసీ, మండల కమిటీల ఏర్పాటు వంటి కార్యక్రమాల అమలును ప్రశంసించారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో నిర్వహిస్తున్న పార్టీ కార్యక్రమాలపై రూపొందిస్తున్న కార్యాచరణ నివేదికలను కూడా ఆమె పరిశీలించారు. ఈ నివేదికల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న పీసీసీ అధ్యక్షుల కార్యాలయ ఇన్చార్జ్, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పి. ప్రసన్న కుమార్ శర్మ సేవలను ప్రత్యేకంగా అభినందించారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ, బీఎల్ఏ శిక్షణా కార్యక్రమాలు, జనహిత పాదయాత్ర తదితర కార్యక్రమాల అమలుపై సమీక్ష అనంతరం.. తెలంగాణ పీసీసీ అనుసరిస్తున్న సంస్థాగత విధానం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. ఈ విధానాలను పరిశీలించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఏఐసీసీ ప్రతినిధులు తెలంగాణ పీసీసీని అభినందించినట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు బలోపేతం చేయడమే లక్ష్యమని మీనాక్షి నటరాజన్ అన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి బీఎల్ఏ పనితీరును పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణ పీసీసీ పనితీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆమె తెలిపారు.
ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కనెక్టింగ్ సెంటర్ చైర్మన్ సెంతిల్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, పి. ప్రసన్న కుమార్ శర్మ, కొప్పుల ప్రవీణ్ కుమార్, గంప వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
