మిడిల్ ఆర్డర్ వైఫల్యం.. భారత్‌కు భారీ దెబ్బ !!

  • సెమీస్ ఆశలు క్లిష్టం
  • ఇక ప్రతి మ్యాచ్ ఫైనలే

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు తొలి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై వరుస విజయాలతో జోరు చూపించిన హర్మన్‌ప్రీత్ సేన.. దక్షిణాఫ్రికాతో జరిగిన కీలక మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో సెమీఫైనల్ అవకాశాలు క్లిష్టంగా మారాయి. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత మిడిల్ ఆర్డర్ తడబాటు పెద్దగా కనిపించలేదు. అయితే బలమైన దక్షిణాఫ్రికా జట్టు ఎదురవగానే ఆ బలహీనత బహిర్గతమైంది.

ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ వేగంగా ఆరంభించి పవర్‌ప్లేలోనే 52 పరుగులు జోడించారు. భారత్ 180-190 పరుగుల స్కోరు దిశగా సాగుతున్నట్టు కనిపించింది. అయితే షెఫాలీ వికెట్‌తో పరిస్థితి మారిపోయింది. అనంతరం యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ వరుసగా పెవిలియన్ చేరడంతో 54/1 వద్ద ఉన్న భారత్ 83/4కు కుప్పకూలింది. రిచా ఘోష్, దీప్తి శర్మ కూడా చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించలేకపోవడంతో భారత్ 158 పరుగులకే పరిమితమైంది.

మ్యాచ్ అనంతరం భారత ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ మాట్లాడుతూ.. “టీ20ల్లో రిస్క్ తీసుకుంటే వికెట్లు పడటం సహజం. మేము ఫియ‌ర్ లెస్ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాం. కొన్ని సందర్భాల్లో వికెట్లు వరుసగా కోల్పోవాల్సి వస్తుంది. అయినా మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. జట్టు తన సామర్థ్యానికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్ అవకాశాలు ఇంకా ఉన్నాయి” అని అన్నారు.

భారత్ ఓటమికి బ్యాటింగ్‌తో పాటు ఫీల్డింగ్ కూడా కారణమైంది. భార‌త్ ఫీల్డింగ్ స‌మ‌యంలో రాధా యాదవ్ రెండు సార్లు…. దక్షిణాఫ్రికా స్టార్ ప్లేయ‌ర్.. మారిజాన్ కాప్ అందిచిన‌ క్యాచ్‌లు వదిలేయడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. కాప్ 25, 65 పరుగుల వద్ద లభించిన అవకాశాలను భారత్ చేజార్చుకుంది.

ఆ స్థాయిలో క్యాచ్‌లు వదిలేస్తే ప్రత్యర్థి జట్టు అవకాశం వదులుకోదు. అవే మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాయి అని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేర్కొన్నారు. అయితే, ఇప్పుడు భారత్‌కు సెమీఫైనల్ రేసులో నిలవాలంటే బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగే చివరి లీగ్ మ్యాచ్ భారత్ ఫ్యూచ‌ర్ నిర్ణయించనుంది.