తల్లికి వందనం పరిధిలోకి అంగన్వాడీలు, మున్సిపల్ సిబ్బంది
- అసెంబ్లీలో బొండా ఉమ విజ్ఞప్తికి ఫలితం
- సెంట్రల్ నియోజకవర్గంలో 1,300 మందికి ప్రయోజనం
- ఈ నెల 22న రాష్ట్రవ్యాప్తంగా 45 వేల మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ
- చిన్న ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం
- ఇతర ఉద్యోగులకూ పథకం వర్తింపజేసేందుకు కృషి చేస్తా
- సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమ
విజయవాడ, ఆంధ్రప్రభ : అంగన్వాడీ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న డ్వాక్రా పారిశుద్ధ్య కార్మికులకు ‘తల్లికి వందనం’ పథకం వర్తింపజేసేలా ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 15-2026తో తన విజ్ఞప్తికి ఫలితం దక్కిందని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు.
శనివారం సింగ్‌నగర్‌లోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమాజానికి సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న డ్వాక్రా మహిళలకు కూడా సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో గత అసెంబ్లీ సమావేశాల్లో పలుమార్లు ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, సంబంధిత మంత్రులను కలిసి ఈ విషయంపై విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. తాజా నిర్ణయంతో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు 300 మంది అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, డ్వాక్రా మహిళలతో పాటు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న సుమారు 1,000 మంది డ్వాక్రా మహిళలకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22న సుమారు 45 వేల మంది తల్లుల బ్యాంకు ఖాతాల్లో ‘తల్లికి వందనం’ పథకం నగదు నేరుగా జమ కానుందని పేర్కొన్నారు. ఇంకా పథకం పరిధిలోకి రాని ఇతర చిన్న ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ‘తల్లికి వందనం’ వర్తింపజేసేలా కృషి చేస్తానని బొండా ఉమ తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిసి సమగ్ర వివరాలతో విజ్ఞప్తి చేయనున్నట్లు వెల్లడించారు.
