అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు అండగా టీడీపీ
పాయకాపురం, ఆంధ్రప్రభ : అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు అండగా టీడీపీ ఉంటుందని, వారిని గుర్తించి పార్టీ పదవులు కట్టబెడతామని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్‌నగర్‌లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు కార్యాలయంలో 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరి పేటకు చెందిన దేవర సత్యనారాయణని తెలుగుదేశం పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు నియమించి, నియామక పత్రాన్ని అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీలో ఎల్లప్పుడూ సముచిత గుర్తింపు, గౌరవం లభిస్తుందని అన్నారు. దేవర సత్యనారాయణ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజలతో మమేకమై పనిచేస్తూ, పార్టీ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తించి ఈ బాధ్యతను అప్పగించినట్లు తెలిపారు.డివిజన్‌లో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లి, ప్రజలకు పార్టీకి మధ్య వారధిగా పనిచేయాలని సూచించారు.
