కాసులు లేనిదే ఫైల్ కదిలేది లేదు
శిక్షణ కాలంలోనే చేతి వాటం
వెలువెత్తుతున్న విమర్శలు
.. డి ఐ జి, జిల్లా రిజిస్ట్రార్ పర్వేక్షణ కరువు
కరీంనగర్ ఆంధ్రప్రభ : శిక్షణ కాలం లో ఏ ప్రభుత్వ అధికారి అయినా నిక్కచ్చిగా ఉంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రయత్నిస్తారు. కాలం గడిచే కొద్దీ చేతి వాటం ప్రదర్శిస్తారు. అయితే కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 లో ప్రభుత్వ ఉద్యోగిగా ఎంపికై శిక్షణ లో ఉన్న అధికారుల వైఖరి ప్రస్తుతం చర్చ నియాంశం గా మారింది . కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లంచాలకు అడ్డాగా మారింది. కాసులు ఇవ్వనిదే ఫైల్ ముందుకు కదలని పరిస్థితులు నెలకొన్నాయి. యువ అధికారులు వచ్చారు. మెరుగైన సేవలు అందుతాయని భావించిన ప్రజలకు వింత పరిస్థితులు ఎదురవుతున్నాయి. వేల రూపాయలు ఇస్తే తప్ప పనులు కానీ పరిస్థితులు ఉన్నాయని వాపోతున్నారు. గతం లో తాము చాలా మంది అధికారులను చూశామని, ఇటువంటి బరితెగింపు అధికారులను ఎపుడు చూడలేదని డాక్యుమెంట్ రైటర్లు కూడా చర్చించుకోవడం ఇక్కడ పని చేస్తున్న అధికారుల లంచగొండి తనాన్ని తెలియ చేస్తుంది. సంబందిత శాఖా మంత్రి తో పాటు ఉన్నతాధికారులు కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పై దృష్టి సారించాలని ప్రజలు విన్నవిస్తున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏసిబి ని ఆశ్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఇంచార్జీ డిఐజి రారు..జిల్లా రిజిస్ట్రార్ సెలవులో
కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు రెగ్యులర్ డిఐజి లేకపోవడం, జిల్లా రిజిస్ట్రార్ సెలవులో ఉండటం తో శిక్షణ లో ఉన్న జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ లు ప్రతిరోజు చేతి వాటం ప్రదర్శిస్తున్నట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఇన్చార్జి డిఐజి కేవలం విధుల్లో చేరి వెళ్లిపోయి వారాలు గడుస్తున్న తిరిగి కార్యాలయం ముఖం చూడకపోవడంతో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కార్యాలయం పై నిఘా కరువైంది. ప్రస్తుతం జిల్లా రిజిస్ట్రార్ సెలవులో ఉండటం కూడా కొత్తగా విధుల్లో చేరిన అధికారులకు వరంగా మారింది.

అంతా చందు మయం
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అంతా చందు మయమైందని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. కార్యాలయం మొత్తం ప్రైవేటు వ్యక్తి కన్సన్నల్లో నడుస్తుందని, శిక్షణలో ఉన్న అధికారులు ప్రైవేటు వ్యక్తి ద్వారా ప్రతినిత్యం లక్షలాది రూపాయలు లంచాల రూపంలో వసూలు చేఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రైవేటు వ్యక్తి మాత్రం దర్జాగా వేలాది రూపాయలు వసూలు చేస్తూ సాయంత్రం ఎవరి వాట వాళ్ళకి పంపిణీ చేస్తాడని సమాచారం. ప్రైవేటు వ్యక్తి కార్యాలయంలో హల్చల్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
ఐజి గారు.. జర చూడండి
కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో జరుగుతున్న అవినీతి పై ఐజి దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా రెగ్యులర్ డిఐజి ని నియమించాలని కోరుతున్నారు.
