గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలి

  • ఎస్‌ఐఆర్ డిజిటలైజేషన్‌ను గడువులోగా పూర్తి చేయండి..
  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

ఖానాపూర్, ఆంధ్రప్రభ: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఖానాపూర్ మండలంలో పర్యటించిన ఆయన గోదావరి పుష్కర ఘాట్లను పరిశీలించడంతో పాటు, ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను సమీక్షించారు.

ముందుగా ఖానాపూర్ పట్టణంలోని ఆరో వార్డు ఉర్దూ భవన్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ఎన్యుమరేషన్ ఫారాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, గడువులోగా డిజిటలైజేషన్ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మొత్తం ఓటర్ల సంఖ్య, సేకరించిన ఫారాలు, ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బీఎల్‌ఓ యాప్ పనితీరును పరిశీలించిన ఆయన, మొత్తం ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.

అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని, బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు ఫారాలు నింపడంలో పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

అనంతరం గోదావరి పుష్కర ఘాట్లను సందర్శించిన భవేశ్ మిశ్రా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఘాట్లకు చేరుకునే రహదారులను మెరుగుపర్చడంతో పాటు, పుణ్యస్నానాలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో రాధా రాథోడ్, మున్సిపల్ కమిషనర్ సుందర్ సింగ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ సోయబ్ హుస్సేన్‌తో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.