గురుకుల ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ పరిధిలోని సీఓఈలు, జూనియర్ కళాశాలలు, సైనిక, ఒకేషనల్, ఫైన్ ఆర్ట్స్ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు కాసిపేట గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వూటూరి సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల పదవ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈనెల 25వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ ప్రవేశ పరీక్ష మే 13వ తేదీన ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు మరిన్ని వివరాల కోసం http://rjcet.telagana.gov.in లేదా http://tgswreis.telangana.gov.in వెబ్‌సైట్‌లను సంప్రదించాలని కోరారు. గురుకులాల్లో కార్పొరేట్ స్థాయి వసతులు.. గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటు ఉచిత హాస్టల్ సౌకర్యం, సన్న బియ్యంతో కూడిన రుచికరమైన ఆహారం, పుస్తకాలు, దుస్తులు అందిస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు.

విద్యార్థుల వ్యక్తిగత ఖర్చుల కోసం నెలవారీ కాస్మెటిక్ ఛార్జీలను నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామన్నారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధనతో పాటు క్రీడలు, గ్రంథాలయ సౌకర్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, ఇక్కడ చదివిన వారు హెచ్‌సీఎల్ వంటి దిగ్గజ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారని గుర్తు చేశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply