జపాన్ ఓపెన్‌లో సెమీస్‌కు దూసుకెళ్లిన సింధు..

  • తొలిసారి సెమీస్‌లోకి భారత స్టార్..
  • ఒకుహారా వైదొలగడంతో వాక్‌ఓవర్
  • ఫైనల్ బెర్త్ కోసం చైనా స్టార్ చెన్ యూఫెయితో నేడు పోరు

ఆంధ్రప్రభ : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్-750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తొలిసారిగా సెమీఫైనల్‌కు చేరుకుంది. టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో శుక్రవారం జరగాల్సిన క్వార్టర్‌ఫైనల్‌లో ఆతిథ్య జపాన్ మాజీ ప్రపంచ ఛాంపియన్ నొజోమీ ఒకుహారా గాయం కారణంగా పోటీ నుంచి వైదొలగడంతో, సింధు సెమీస్ కి డైరెక్ట్ గా ఎంట‌ర్ అయ్యింది.

దీంతో సింధు 2023 డెన్మార్క్ ఓపెన్ తర్వాత తొలిసారిగా సూపర్-750 టోర్నీలో సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. అంతేకాదు, జపాన్ ఓపెన్ చరిత్రలో ఆమె సెమీఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ 2026 సీజన్‌లో సింధుకు ఇది మూడో సెమీఫైనల్. ఈ ఏడాది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 18వ స్థానంతో ప్రయాణం ప్రారంభించిన ఆమె, అద్భుత ప్రదర్శనతో ప్రస్తుతం ప్రపంచ 9వ ర్యాంక్‌కు చేరుకుంది.

చెన్ యూఫెయితో కఠిన పోరు

శనివారం జరిగే సెమీఫైనల్‌లో సింధు ప్రపంచ నాలుగో ర్యాంకర్, చైనా ఒలింపిక్ స్వర్ణ పతక విజేత చెన్ యూఫెయితో తలపడనుంది. క్వార్టర్‌ఫైనల్‌లో చెన్ 21-10, 21-12తో దక్షిణ కొరియాకు చెందిన సిమ్ యు జిన్‌ను వరుస గేమ్‌లలో ఓడించి సెమీస్‌కు చేరుకుంది.

ఇద్దరి మధ్య ఇప్పటివరకు జరిగిన 14 మ్యాచ్‌ల్లో చెన్ యూఫెయి 8 విజయాలు సాధించగా, సింధు 6 మ్యాచ్‌లు గెలిచింది. అయితే ఇటీవల జరిగిన వరుస ఐదు మ్యాచ్‌ల్లో సింధుపై చెన్ విజయం సాధించింది. ఈసారి ఆ పరాజయాల పరంపరకు తెరదించి, దాదాపు మూడేళ్ల తర్వాత సూపర్-750 టోర్నీలో ఫైనల్‌కు చేరాలని భారత స్టార్ లక్ష్యంగా పెట్టుకుంది.