వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2 మ్యాచ్ క్రికెట్ అభిమానులను ఉత్కంఠకు గురి చేస్తోంది. ఫైనల్ బరిలోకి అడుగుపెట్టాలనే పట్టుదలతో ముంబై ఇండియన్స్ – పంజాబ్ కింగ్స్ జట్లు తలపడ్డాయి. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసి పంజాబ్‌కు భారీ లక్ష్యాన్ని నిర్ధారించింది.
ముంబై బ్యాటర్ల మెరుపులు:
ఓపెనర్ జానీ బెయిర్‌స్టో 24 బంతుల్లో 38 పరుగులు చేసి ఆరంభాన్ని శుభంగా మలిచాడు. తొలి వికెట్ త్వరగా కోల్పోయినప్పటికీ, వన్‌డౌన్‌కి వచ్చిన తిలక్ వర్మ నిలకడగా ఆడాడు. 29 బంతుల్లో 44 పరుగులు చేసిన తిలక్, బెయిర్‌స్టోతో కలిసి 29 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు.
తర్వాత తిలక్ వర్మకు తోడుగా వచ్చిన సూర్య కుమార్ యాదవ్ మరోసారి తన క్లాస్‌ను ప్రదర్శించాడు. ఈ జంట మూడో వికెట్‌కు 42 బంతుల్లో 72 పరుగుల భాగస్వామ్యం అందించారు. సూర్యకుమార్ 26 బంతుల్లో 44 పరుగులతో మెరిశాడు.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 పరుగులు) ఆశించిన స్థాయిలో రాణించకపోయినా, ఇన్నింగ్స్ చివర్లో నమన్ ధీర్ అద్భుతంగా ఆడి 18 బంతుల్లో 37 పరుగులతో మ్యాచ్ మోమెంటమ్‌ను నిలబెట్టాడు.
పంజాబ్ బౌలింగ్:
పంజాబ్ బౌలింగ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు కీలక వికెట్లు తీయగా, కైల్ జేమీసన్, మార్కస్ స్టోయినిస్, వైషాక్ విజయ్‌కుమార్, యుజ్వేంద్ర చాహల్ తలా ఒక వికెట్ తీసి ముంబై పరుగులకు కొంత కట్టడి వేశారు. దీంతో ఐపీఎల్ 2025 ఫైనల్ బరిలో అడుగుపెట్టాలంటే పంజాబ్ కింగ్స్ 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది.