భక్తులతో కిక్కిరిసిన శబరిమల..
- కర్కాటక మాస పూజల కోసం తెరచుకున్న అయ్యప్ప ఆలయం..
- తొలి రోజే భారీగా తరలివచ్చిన భక్తులు
ఆంధ్రప్రభ : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల శ్రీ అయ్యప్పస్వామి ఆలయం కర్కాటక మాస పూజల కోసం గురువారం సాయంత్రం భక్తులకు తెరుచుకుంది. ఆలయం తెరిచిన తొలి రోజే భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో సన్నిధానం ప్రాంతం భక్తజన సందోహంతో కిక్కిరిసిపోయింది. సాయంత్రం 5 గంటలకు ప్రధాన తంత్రి సమక్షంలో మేల్శాంతి గర్భగుడి తలుపులు తెరిచి పవిత్ర దీపాన్ని వెలిగించారు. తొలి రోజు ప్రత్యేక పూజలు నిర్వహించలేదు.
అయితే కేరళతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి కర్కాటక మాస తొలి రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు, నిత్యారాధనలు ప్రారంభమవుతాయి. ఈ పూజలు జూలై 21 వరకు కొనసాగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, భద్రత, క్యూ లైన్లు, తాగునీరు, వైద్య సేవలను అందుబాటులో ఉంచారు.
